నెల 27న హన్మకొండ జిల్లా పెంచికల్ పేటలో జరగాల్సిన సీఎం కేసీఆర్ అభినందన సభకు కేంద్ర ఎన్నికల కమిషన్ తాజా ఉత్తర్వులు అడ్డంకిగా మారింది. ఉప ఎన్నికతో ప్రత్యక్షంగా సంబంధం ఉన్న జిల్లాలు, చుట్టు పక్కల నియోజకవర్గాల్లో ఏ రాజకీయ కార్యకలాపాలు చేపట్టకూడదని సీఈసీ ఆదేశించడంతో…సభ రద్దయినట్టు తెలుస్తోంది. దీంతో టీఆర్ఎస్ ఎలాంటి ప్రత్యామ్నాయాలు చేస్తుందనేది ఆసక్తిగా మారింది. దేశంలోని పలు నియోజకవర్గాల్లో ఉపఎన్నికల కారణంగా కేంద్ర ఎన్నికల సంఘం తాజా మార్గదర్శకాలు విడుదల చేసింది. బై ఎలక్షన్ జరిగే నియోజకవర్గంతో పాటు పక్క జిల్లాలు, ఉపఎన్నికతో నేరుగా సంబంధం ఉన్న నియోజకవర్గాల్లో ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు చేపట్టకూడదని ఈసీ స్పష్టం చేసింది.
ఈ ప్రాంతాల్లో ఎలక్షన్ కోడ్, కొవిడ్ నిబంధనలు అమలయ్యేలా చూడాలని జిల్లా ఎన్నికల అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు హుజూరాబాద్ ఉప ఎన్నిక కారణంగా కరీంనగర్, హన్మకొండ జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. దీంతో ఈనెల 27న హన్మకొండ జిల్లా పెంచికల్ పేట గ్రామంలో తలపెట్టిన కేసీఆర్ బహిరంగ సభ రద్దయినట్టే.
హుజురాబాద్‌కు పక్కనే పెంచికల్ పేట ఉండటంతో.. ఎన్నికల నిబంధనల ప్రకారం భారీ బహిరంగ సభ ఏర్పాటుకు వీలు లేకపోవడంతో ఈ పరిస్ధితి తలెత్తింది. కొద్దిరోజులుగా హుజురాబాద్ నియోజకవర్గంలో అన్ని పార్టీలు జోరుగా ప్రచారం సాగిస్తున్నాయి. అధికార పార్టీ టీఆర్ఎస్ తమ అధినేత కేసీఆర్‌తో సభలు నిర్వహించేలా ప్రణాళికలు రచించింది. అయితే కేంద్ర ఎన్నికల సంఘం కొత్త గైడ్‌లైన్స్ తో కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించే పరిస్ధితి లేకుండా పోయింది. అయితే హుజూరాబాద్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ రోడ్ షో ఉండే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.