NTV Telugu Site icon

Telangana Assembly Session: కేసీఆర్ తో మంత్రులు భేటీ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం ఆరా

Harish Rao

Harish Rao

Telangana assembly session: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ తో రాష్ట్ర మంత్రులు హరీశ్‌ రావు, వేముల ప్రశాంత్‌ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిపై సమావేశంలో చర్చించనున్నారు. రూ.40వేల కోట్ల లోటు అంశంపై కూడా సమావేశంలో చర్చకు రానుంది. కేంద్రం నిర్వహిస్తున్న ఆర్థిక శాఖ సమావేశానికి హరీశ్‌ రావు హాజరుకాలేదు. సమావేశానికి దూరంగా ఉండి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. డిసెంబరులో తెలంగాణ శాసనసభ సమావేశాలు జరగనున్నాయి. ఏడు రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.

Read Also: Viral Video: అయ్యో.. కళ్లెదుటే బిడ్డల ప్రాణాలు పోతున్నా కాపాడుకోలేకపోయింది

తెలంగాణ ఆర్థిక పరిస్థితులతో పాటు కేంద్ర సర్కారు విధిస్తున్న ఆంక్షలపై ఇందులో చర్చ జరగనుంది. అన్ని విషయాలు ప్రజలకు తెలిపేందుకు డిసెంబరులో శాసనసభ సమావేశాలు ఉంటాయని కేసీఆర్ ప్రకటించారు. కేంద్ర సర్కారు ఆంక్షలతో తెలంగాణ ఆదాయం రూ.40 వేల కోట్లు తగ్గుతోందని కేసీఆర్ అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మోకాలడ్డుతోందని ఆరోపించారు. శాసనసభ సమావేశాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రులు హరీశ్‌ రావు, ప్రశాంత్‌ రెడ్డికి కేసీఆర్ చెప్పారు. కాగా, తెలంగాణ అసెంబ్లీ ఈ ఏడాది సెప్టెంబర్‌లో సమావేశమైన విషయం తెలిసిందే. అయితే, ఇప్పటివరకు ప్రోరోగ్ కాకపోవడంతో ఆ సమావేశాలకు కొనసాగింపుగానే డిసెంబరు సమావేశాలు ఉంటాయని తెలుస్తోంది. తెలంగాణలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగాల్సి ఉంది. దీంతో ఇక్కడి అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఆ అంశంపైనే దృష్టి పెట్టాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా జరిగే అవకాశం ఉంది.