Viral Video: కడుపులో పెట్టుకుని చూసుకుంటున్న బిడ్డల ప్రాణం కళ్లెదుటే పోతుంటే ఆ తల్లిపడే వేదన మాటల్లో చెప్పలేము. అది మనుషులకైనా, జంతువులకైనా ఒకే విధంగా ఉంటుంది. కళ్లముందే కొన ప్రాణాలతో బిడ్డలు కొట్టుమిట్టాడుతుంటే దేవుడా.. నా పిల్లలను కాపాడు అంటూ ఆ తల్లి ఎంతమందిని వేడుకుందో. కానీ కనికరం లేని ఆ కసాయి దేవుడు తన పిల్లలను దూరం చేశాడు.. ఆ తల్లికి కడుపుకోత మిగిల్చాడు. కాకపోతే ఇక్కడ తల్లిప్రేమ ఒక్కటే కానీ.. జాతి మాత్రమే వేరు. ఇటీవల ఓ వీడియో సోషల్ మీడియాలో అందరి చేత కన్నీ్ళ్లు పెట్టిస్తోంది. వివరాల్లోకి వెళితే.. బషీరాబాద్ మండలం మంతట్టి గ్రామంలో ఓ కుక్క ఇటీవలే మూడు కుక్క పిల్లలకు జన్మనిచ్చింది. ఓ చిన్న కుటీరంలో ఆవాసాన్ని ఏర్పరుచుకుని అందులో పిల్లలతో కలిసి ఉంటోంది. తల్లికుక్క బయటకు వెళ్లగానే.. ఓ భారీ నాగుపాము కుక్క పిల్లలపై విరుచుకుపడింది. ఒకదానిపై.. మరొకదానిపై దాడి చేసుకుంటూ తన విషపు కోరలతో కాసేసి అంతం చేసుకుంటూ పోయింది. అంతలోనే తల్లి కుక్క అక్కడికి చేరుకుని పాముపై ఎదురుదాడి చేసినా ఫలితం లేకుండా పోయింది. దాదాపు గంట పాటు పాము కుక్క పిల్లలపై దాడి చేసింది. కుటీరంలో ఉన్న కుక్క పిల్లను పాము తన పంటితో బయటకు లాక్కొచ్చి మరీ కాటేసింది. స్థానికులు తీసిన వీడియో అందరిని కంటతడి పెట్టిస్తోంది.