CM YS Jagan: రేపు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా మాచర్లలో పర్యటించనున్నారు. పల్నాడు ప్రజల ఆరు దశాబ్దాల స్వప్నమైన, ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న వరికపూడిసెల ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యమంత్రి జగన్ మాచర్ల షెడ్యూల్ ప్రకారం.. ఉదయం పది గంటల ప్రాంతంలో తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి మాచర్ల చేరుకుంటారు. మాచర్లలో చెన్నకేశవ కాలనీ ఎదురుగా ఏర్పాటు చేసిన బహిరంగ సభా స్థలి వద్ద ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసే బహిరంగ సభలో ప్రసంగించి తిరిగి మధ్యాహ్నం తాడేపల్లికి చేరుకుంటారు.
Also Read: Ponguleti Srinivas Reddy: తెలంగాణలో కాంగ్రెస్‌కు టీడీపీ మద్దతు ఇస్తుందని అనుకుంటున్నా..
పల్నాడు, ప్రకాశం జిల్లాల ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ.. “వైఎస్సార్ పల్నాడు కరువు నివారణ పథకం” క్రింద… రూ. 340.26 కోట్ల వ్యయంతో చేపట్టనున్న వరికపూడిశెల ఎత్తిపోతల పథకానికి కీలక అటవీ, పర్యావరణతో పాటు అన్ని అనుమతులు సాధించి రేపు పనులకు శ్రీకారం చుట్టనున్నారు సీఎం జగన్. రూ. 340.26 కోట్ల వ్యయంతో వెల్దుర్తి, ఉప్పలపాడు, గొట్టిపాళ్ల, సిరిగిరిపాడు. బొదిలవీడు, గంగలకుంట, కండ్లకుంట గ్రామాల పరిధిలో 24,900 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 20 వేల మంది జనాభాకు వైసీపీ సర్కారు తాగునీరు అందించనుంది.
రాష్ట్రంలో పూర్తిగా పైపులైన్ల ద్వారా నీరందించే తొలి ప్రాజెక్ట్ వరికెపూడిసెల ప్రాజెక్టు. 4 పంపుల ద్వారా 281 క్యూసెక్కుల నీటి సరఫరాను అందించనుంది. 1.57 టీఎంసీల నీటిని ఎత్తిపోసి 7 గ్రామాల్లోని 24.900 ఎకరాలకు సాగు నీరు.. 20,000 మంది జనాభాకు తాగునీరు అందించనుంది. ఇప్పటికే అటవీ ప్రాంతంలో పంప్ హౌస్ నిర్మాణానికి నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్, అటవీ, పర్యావరణ విభాగాల నుండి కీలకమైన అనుమతులతో ఇక పనులకు శ్రీకారం చుట్టనున్నారు. వరికపూడిసెల ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా నది జలాలను మళ్లించి వెనుకబడిన మెట్ట ప్రాంతాల ప్రజల కష్టాలను జగన్ సర్కారు తీర్చనుంది.
వన్యప్రాణి సంరక్షణ అనుమతులు సాధించిన తేదీ- 19 మే 2023
అటవీ అనుమతులు సాధించిన తేదీ- 06 నవంబర్ 2023