Site icon NTV Telugu

Cm Jagan Mohan Reddy: వ్యవసాయ, పౌరసరఫరాల శాఖపై జగన్ సమీక్ష

Ys Jagan

Ys Jagan

ఖరీప్‌ ధాన్యం సేకరణ, ఇతర పంటలపై వ్యవసాయ, పౌరసరఫరాలశాఖలతో క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష చేపట్టారు. మిల్లర్ల ప్రమేయంలేకుండా సేకరిస్తున్న కొత్త విధానం అమలు తీరును సమగ్రంగా సమీక్షించారు సీఎం. రైతులకు కనీస మద్దతు ధర కన్నా.. ఒక్కపైసా తగ్గకుండా రేటు రావాలనే ఉద్దేశంతో కొత్త విధానానికి శ్రీకారం చుట్టాం అన్నారు జగన్. దీనికోసం ధాన్యం సేకరణలో తొలిసారిగా మిల్లర్ల ప్రమేయాన్ని తీసివేశాం అన్నారు. ఈ కొత్తవిధానం ఎలా అమలవుతున్నదీ గమనించుకుంటూ ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలను ఎక్కడికక్కడే పరిష్కరించేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి.

చేయాల్సిన ధాన్యంసేకరణపై ముందస్తు అంచనాలు వేసుకుని, ఆ మేరకు ముందస్తుగానే గోనెసంచులు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. వెంటనే దీనిపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు. రవాణా, లేబర్‌ ఖర్చుల రీయింబర్స్‌మెంట్‌లో జవాబుదారీతనం ఉండాలి. అత్యంత పారదర్శకంగా ఈ చెల్లింపులు ఉండాలి. ఈ విధానాన్ని ఒకసారి పరిశీలించి.. రైతులకు మేలు చేసేలా మరింత మెరుగ్గా దీన్ని తీర్చిదిద్దాలని ఆదేశించారు. రవాణా ఖర్చులు, గన్నీ బ్యాగుల ఖర్చులను ప్రభుత్వం చెల్లిస్తోందన్న విషయం రైతులకు తెలియాలన్నారు.

రైతులకు చేస్తున్న చెల్లింపులన్నీ కూడా అత్యంత పారదర్శకంగా ఉండాలన్నారు. ప్రత్యక్ష నగదు బదిలీ పద్ధతిలో కార్పొరేషన్‌ నుంచి వారికి డబ్బు చేరేలా చర్యలు తీసుకోవాలి. దీనివల్ల చెల్లింపుల్లో అత్యంత పారదర్శకత తీసుకు వచ్చినట్టు అవుతుంది. ధాన్యం సేకరణకోసం తయారు చేసిన యాప్‌లో.. సిగ్నల్స్‌ సమస్యల వల్ల అక్కడడక్కగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆఫ్‌లైన్‌లో వివరాలు నమోదుచేసుకుని, సిగ్నల్‌ ఉన్న ప్రదేశాల్లోకి వెళ్లగానే ఆ వివరాలన్నీ ఆటోమేటిక్‌గా ఆన్‌లైన్‌లోకి లోడ్‌ అయ్యేలా మార్పులు చేసుకోవాలి. అనేక ప్రభుత్వ శాఖల్లో ఇప్పటికే ఇలాంటి పద్ధతులు పాటిస్తున్నాం. ఆ శాఖల నుంచి తగిన సాంకేతిక సహకారాన్ని తీసుకోవాలని సీఎం సూచించారు.

Read Also: MLAs Bribe Case: ఎమ్మెల్యేల ఎర కేసు.. విచారణను 13కి వాయిదా వేసిన కోర్టు

పౌరసరఫరాలశాఖ జిల్లా మేనేజర్ల విధులపై ఎస్‌ఓపీలను తయారుచేయాలి. ఈ ఎస్‌ఓపీలను పాటించేలా సమర్థవంతమైన పర్యవేక్షణ ఉండేలా చూడాలన్నారు. అవకతవకలకు, అవినీతికి ఆస్కారం లేకుండా ఈ ఎస్‌ఓపీలు ఉండాలి. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పంటల సాగుమీదకూడా రైతులకు అవగాహన కలిగించాలన్నారు సీఎం జగన్. అలాంటి రైతులను ప్రోత్సహించాలి. మన ప్రభుత్వం వచ్చాక మిల్లెట్స్‌ సాగును ప్రోత్సహిస్తున్నాం. ఎవరైనా మిల్లెట్స్‌ కావాలి అని అడిగితే, వాటిని వినియోగిస్తామని కోరితే పౌరసరఫరాల శాఖ ద్వారా వారికి అందించడంపైనకూడా దృష్టిపెట్టాలన్నారు.

కోరుకున్న వారికి వాటిని సరఫరా చేయాలన్నారు సీఎం. ఈ సమీక్షా సమావేశంలో వ్యవసాయ, మార్కెటింగ్, సహకారశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఏపీ అగ్రిమిషన్‌ వైస్‌చైర్మన్‌ ఎంవియస్‌ నాగిరెడ్డి, సీఎస్‌ డాక్టర్‌ కే ఎస్‌ జవహర్‌రెడ్డి, మార్కెటింగ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, ఆర్ధికశాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ, రవాణాశాఖ కార్యదర్శి పీ ఎస్‌ ప్రద్యుమ్న, పౌరసరఫరాలశాఖ కార్యదర్శి హెచ్‌ అరుణ్‌కుమార్, వ్యవసాయశాఖ కమిషనర్‌ సి హరికిరణ్, మార్కెటింగ్‌శాఖ కమిషనర్‌ రాహుల్‌ పాండే, పౌరసరఫరాల డైరక్టర్‌ విజయ సునీత, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Read Also: Supreme Court: భారత్‌లో ప్రతీ ఒక్కరికి దేవుడిని ఎంచుకునే హక్కు ఉంది..

Exit mobile version