CM Chandrababu Key Orders to MPs over Delimitation Bill: పార్లమెంటులో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లుల నేపథ్యంలో టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన ఎంపీలతో ఏపీ సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కీలక బిల్లులపై ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. కూటమికి చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులందరూ ఆదివారం సాయంత్రానికల్లా ఢిల్లీలో అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. కూటమి నుంచి ఒక్క ఎంపీ కూడా పార్లమెంటుకు హాజరుకాలేదనే మాట రాకూడదని, ప్రతి ఒక్కరూ ఈరోజే ఢిల్లీ చేరుకోవాలని ఎంపీలకు సీఎం సూచించారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ‘పార్లమెంటులో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు చర్చకు రావడం చారిత్రాత్మక సందర్భం. ప్రధాని నరేంద్ర మోడీ గొప్ప సంకల్పంతో మహిళా రిజర్వేషన్ బిల్లును ముందుకు తీసుకెళ్తున్నారు. మహిళా శక్తిని చాటిచెప్పేలా ఈ బిల్లు ఆమోదం పొంది కొత్త చరిత్ర సృష్టిస్తుంది. ఇలాంటి చారిత్రక సందర్భంలో ప్రతి పార్లమెంట్ సభ్యుడు తన వంతు పాత్ర పోషించాలి. గతంలో నియోజకవర్గాల పునర్విభజన జరిగిన సమయంలో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా చూశారు. తాజా డీలిమిటేషన్ ప్రక్రియలోనూ అన్ని రాష్ట్రాలకు 50 శాతం సీట్లు పెరిగేలా ప్రతిపాదనలు ఉన్నాయి. డీలిమిటేషన్ వల్ల ఏ రాష్ట్రానికీ నష్టం జరగదు. సీట్ల పెంపును అన్ని వర్గాలు, రాజకీయ పార్టీలు స్వాగతించాలి’ అని అన్నారు.
‘దేశంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. గతంలో ఈ బిల్లులను వ్యతిరేకించిన పార్టీలు సైతం ఇప్పుడు మద్దతు పలుకుతున్నాయి. ఇది మంచి పరిణామం. ఈ బిల్లుల విషయంలో ఎన్డీఏ సూచనలను ఎంపీలందరూ తూచా తప్పకుండా పాటించాలి. రాష్ట్రానికి చెందిన కూటమి ఎంపీలంతా సమన్వయంతో పనిచేసి ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయాలకు పూర్తి మద్దతు లభించేలా వ్యవహరించాలి. మహిళా రిజర్వేషన్ బిల్లు చర్చకు వచ్చే సమయంలో రాష్ట్రానికి చెందిన మహిళా ప్రజాప్రతినిధులు కూడా పార్లమెంటులో హాజరయ్యేలా చూడాలి. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ వంటి చారిత్రక నిర్ణయాల సమయంలో ఎంపీలుగా ఉండటం మీరందరికీ గొప్ప అవకాశం’ అని సీఎం పేర్కొన్నారు. ఈ టెలీకాన్ఫరెన్స్‌లో కేంద్ర మంత్రులతో పాటు టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు పాల్గొన్నారు.

