CM Chandrababu: ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడులో అర్హులైన 200 మందికి ఇళ్లు కట్టించి ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. భూసేకరణ చేయాలని అధికారులను ఆదేశిస్తున్నామన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు అయ్యింది.. మీటింగ్ పెట్టాలనుకుంటే ఒక లక్ష మందితో పెట్టొచ్చు.. ప్రజలను చూడటానికి వచ్చా తప్ప.. ఆర్భాటాలు.. హంగుల కోసం కాదని సీఎం చంద్రబాబు అన్నారు. తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ ఆర్భాటంలో లేనన్నారు. మళ్ళీ నేనైతేనే గాడితప్పిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెడతానని అవకాశం ఇచ్చారన్నారు. 93 శాతం సీట్లు మాకు ఇచ్చారని, రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలని తనకు ఓట్లు వేశారన్నారు. రాష్ట్రం వెంటిలేటర్ మీద ఉందన్నారు. 21 మంది ఎంపీలను ఇచ్చి కేంద్రంలో మన పరపతి పెంచారన్నారు. 10 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉందని.. లక్ష కోట్ల వడ్డీలు కట్టకపోతే రాష్ట్రం పరువు పోతుందన్నారు. ఏడు వైట్ పేపర్లు పెట్టి.. వాస్తవాలు అందరి ముందు ఉంచానన్నారు. ఒక్కొక్క సమీక్ష చూస్తుంటే భయం వేస్తోందన్నారు. కేంద్ర నిధులు కూడా లెక్క పత్రం లేకుండా పక్కదారి పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Samineni Udayabhanu: వైసీపీకి మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను రాజీనామా
అన్నీ రంగాలను భ్రష్టు పట్టించారన్న ఆయన.. కేంద్రం ఇచ్చిన ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతంలో నీళ్ళు ఇచ్చే అవకాశం ఉన్నా పట్టించుకోలేదన్నారు. కేంద్రం ఇచ్చిన డబ్బులకు లెక్కలు చూపించకుండా ఇష్టానుసారం చేశారని తీవ్రంగా విమర్శించారు. 26 జిల్లాలో ఇంటింటికీ నీళ్ళు ఇచ్చేలా ప్రణాళికలు రచిస్తున్నామన్నారు. నిధుల వెసులుబాటును బట్టి అన్నీ కార్యక్రమాలు చేస్తామన్నారు. గత ముఖ్యమంత్రి జల జీవన్ మిషన్‌ను కూడా విధ్వంసం చేశారని మండిపడ్డారు. ఆయన చేసిన పనులు మీ ముందు ఉంచామన్నారు. గతంలో అందరికీ సంతానాన్ని అదుపులో ఉంచుకోవాలని చెప్పా.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. జనాభా పెరుగుదల నిష్పత్తి తగ్గుతుందన్నారు. అందరూ జనాభా పెరుగుదల మీద దృష్టి పెట్టకపోతే పూర్తిగా జనాభా తగ్గిపోతుందన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా ఇదే చెప్పారని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ముసలి వాళ్ళు పెరుగుతున్నారని.. కుర్రవాళ్ళు తగ్గిపోతున్నారని సీఎం చెప్పారు. పాపులేషన్ మేనేజ్మెంట్‌పై అందరూ దృష్టి పెట్టాలన్నారు. తాను 25 ఏళ్ల క్రితం ప్రారంభించిన ఐటీ యజ్ఞం ఫలాలు ఇప్పుడు వచ్చాయని, గతంలో తాను వేసిన ఫౌండేషన్ వల్ల తెలంగాణ తలసరి ఆదాయం పెరిగిందన్నారు. మోసపూరిత వ్యక్తులు చెప్పే మాటలు నమ్మొద్దని.. మీ అందరికీ న్యాయం చేసే బాధ్యత తనదని ప్రజలకు చంద్రబాబు సూచించారు.
తాను ఒకప్పుడు సెల్ ఫోన్ గురించి మాట్లాడే వాడినని.. ఇప్పుడు ఏ పని కావాలన్నా ఆఘమేఘాల మీద జరిగి పోతుందన్నారు. మెగా డీఎస్సీ పెట్టామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలనే ఆశయంతో పనిచేస్తున్నామన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశామని.. అది కాకుంటే మీ ఆస్తులు ఏవీ మీవి కావంటూ పేర్కొన్నారు. రాజముద్రతో అందరికీ త్వరలో పట్టాదారు పాసు పుస్తకాలు అందజేస్తా్మన్నారు. అన్నా క్యాంటీన్ మళ్ళీ ప్రారంభించామని.. అందరికీ కడుపునిండా కూడు పెట్టే కార్యక్రమాన్ని కూడా రద్దు చేశారని మండిపడ్డారు. ఉచితం అంటే ఎవరూ పెత్తనం చేయటానికి వీలు లేదని.. ఇసుక ఎక్కడ అందుబాటులో ఉన్నా ఉచితంగా తీసుకువెళ్లొచ్చన్నారు. ఇసుక లేకపోతేనే రీచ్‌లకు వెళ్ళాలన్నారు. రాష్ట్రం మొత్తానికి ఈ మెసేజ్ ఇస్తున్నామన్నారు. ఇసుక దొరకని ప్రాంతాలు ఉంటే వాళ్ళు మాత్రమే ఆన్ లైన్‌లో బుక్ చేసుకోవచ్చన్నారు. మద్యం బాబులకు నిన్ననే శుభవార్త చెప్పామన్నారు.
Read Also: Karnataka: శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం.. కర్ణాటక సర్కారు సంచలన నిర్ణయం
గతంలో మద్యంపై దోపిడీ సాగించారని.. ప్రజల ఆరోగ్యంతో ఆడుకున్నారని విమర్శించారు. కేంద్రం అన్నిరకాలుగా సహాయ సహకారాలు ఇస్తుందన్నారు. ఒన్ నేషన్ ఒన్ ఎలక్షన్ అని కేంద్రం అనౌన్స్ చేసిందని.. మన ఎన్నికలు కేంద్రంతోటే వస్తాయన్నారు. చిత్తుచిత్తుగా ఓడిన పార్టీ అది చేయలేదు.. ఇది చేయలేదు అని విమర్శిస్తోందన్నారు. ఎవరి మతం మీద వాళ్లకు విశ్వాసం ఉంటుందని.. తిరుపతి మత విశ్వాసాన్ని దెబ్బ తీశారన్నారు. తక్కువ ధరకు వస్తుందని కల్తీ నెయ్యి తీసుకువచ్చి దేవుడికి నైవేద్యం పెట్టారని విమర్శించారు. ఆవునెయ్యికి కనీసం 500 రూపాయల ధర ఉంది.. 320 రూపాయలకు తక్కువ ధరకు నెయ్యి తీసుకు వచ్చారన్నారు. గతంలో ప్రసాదాలకు.. ఇప్పటి ప్రసాదాలను ఎంత తేడా ఉందో అందరూ గమనిస్తున్నారన్నారు శ్యామలరావు అనే ఒక అధికారిని వేసాను.. ఆయనకు ఒకటే చెప్పాను.. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేయాలని చెప్పామన్నారు.
ఇటీవల వరదలు వస్తే.. బుడమేరుకు గండ్లు పెట్టారని.. మూడు బోట్లు కృష్ణా నదిలోకి వదిలారని ఆరోపించారు.10 లక్షల క్యూసెక్కుల వేగంతో అవి వచ్చి గేట్లను కొడితే ఏమవుతుందన్నారు. వాళ్ళు చేసిన నేరాలు మా మీద వేయాలని చూశారని.. మాట్లాడితే ఎదురు దాడి చేస్తున్నారన్నారు. ముంబై నుంచి ఓ యాక్టర్‌ను తీసుకువచ్చి ఇబ్బందులు పెట్టారని.. చట్టాన్ని ఇష్టం వచ్చినట్లు వాడుకున్నారని విమర్శించారు. ఏమీ తెలియని ఏ1, ఏ2లు నాకు అడ్మినిస్ట్రేషన్ గురించి చెబుతున్నారన్నారు. ఎవరి దగ్గర నుంచి తనకు పరిపాలన నేర్చుకోవాల్సిన పరిస్థితి లేదన్నారు. రాబోయే రోజుల్లో ఏపీని ఎకనామీలో దేశంలోనే నంబర్ వన్ గా చేస్తానని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. దీపావళికి ఆడబిడ్డలకు ఉచిత గ్యాస్ అందిస్తామన్న సీఎం చంద్రబాబు.. ఆడబిడ్డలకు ఇచ్చిన అన్నీ హామీలు నెరవేరుస్తామన్నారు. ఒక్క పిలుపుతో దాతలు ముందుకు వచ్చి 350 కోట్లు విరాళం అందజేశారన్నారు. వచ్చిన విపత్తును అందరూ గుర్తించి ముందుకు వచ్చి సాయం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.