మత సంఘాలతో కలిసి ఇంటర్ ఫెయిత్ సమావేశం జరుగుతున్న సమయంలోనే భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య సీజ్‌ఫైర్ ఒప్పందం జరగడం శుభపరిణామం అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. భారత్ దేశానికి మరో దేశం మీద యుద్ధం చేయాలని ఉండదన్నారు. దేశం మొత్తం మతాలకు, కులాలకు అతీతంగా పాక్ దాడులను ఖండించాలన్నారు. ఉగ్రవాదంపై భారత్ పోరాటం ఆగదు అని సీఎం అన్నారు. భారత్‌ను విడకొట్టాలని చాలా శక్తులు ప్రయత్నాలు చేస్తున్నాయని, అందరం ఐక్యంగా ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. రాజ్ భవన్‌లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆధ్వర్యంలో ఇంటర్ ఫెయిత్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ సహా మంత్రులు, ఉన్నతాధికారులు, మతాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇంటర్ ఫెయిత్ సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… ‘మురళీ నాయక్ దేశం కోసం అమరుడు అయ్యాడు. భారత్ దేశానికి మరో దేశం మీద యుద్ధం చేయాలని ఉండదు. దేశం మొత్తం మతాలకు, కులాలకు అతీతంగా పాక్ దాడులను ఖండించాలి. ఉగ్రవాదంతో మనం ఎప్పుడూ పోరాడుతున్నాం. సరిహద్దులో ఉద్రిక్తత పరిస్థితులు ఉన్నాయి. రెండు దేశాలు కాల్పుల విరమణకు ముందుకు వచ్చాయి. ఉగ్రవాదంపై మన పోరాటం ఆగదు. మన ఈ కార్యక్రమం జరుగుతున్నప్పుడే కాల్పుల విరమణ ప్రకటించడం శుభపరిణామం’ అని అన్నారు.
‘భారత్ పరిణితి చెందిన దేశం. ఈ దేశంలో బిన్నత్వంలో ఏకత్వం చూస్తాం. ఏ మతం వారైనా అందరం భారతీయులమే. భారత్‌ను విడకొట్టాలని చాలా శక్తులు ప్రయత్నాలు చేస్తున్నాయి, అందరం ఐక్యం గా ఉండాలి. కొన్నిసార్లు యువత కూడా దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు. అన్నింటి కంటే దేశం ముఖ్యం అని గుర్తించాలి’ అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పారు. ‘పహల్గామ్ దాడిలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదుల దాడికి సంబంధించిన అన్ని ఆధారాలు లభించాయి. పాక్ ఉగ్ర స్థావరాలపై మన సైనికులు దాడి చేశారు. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో దేశానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ అండగా వుంటుంది’ అని గవర్నర్ అబ్దుల్ నజీర్ చెప్పుకొచ్చారు.
