నూతన ఐటీ పాలసీపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. స్టార్టప్‌లకు రూ.25 లక్షల వరకు సీడ్ ఫండింగ్ చేస్తామని చెప్పారు. 2029 నాటికి రూ. 5 లక్షల వర్క్ స్టేషన్లు పెట్టనున్నట్లు తెలిపారు. అమరావతిలో డీప్ టెక్నాలజీ భవనం నిర్మాణం, యువత భవిష్యత్ అంతా డీప్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వంటి నూతన టెక్నాలజీల పైనే ఉందని తెలిపారు. ప్రస్తుతం డీప్ టెక్నాలజీతో ఉత్పన్నమయ్యే అవకాశాలను అందిపుచ్చుకునే దిశగా డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం ఉండాలని సూచించారు.
READ MORE: RRR Case: రఘు రామకృష్ణంరాజుపై థర్డ్ డిగ్రీ కేసులో.. అడిషనల్ ఎస్పీ అరెస్ట్‌కు సన్నాహాలు
స్టార్టప్ పాలసీలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలకు రూ.25 లక్షల వరకూ సీడ్ ఫండింగ్ ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఐఐటీలతో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (ఆర్టీఐహెచ్) అనుసంధానం చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఐదు జోనల్ ఇన్నోవేషన్ హబ్‌ల ఏర్పాటు చేయనున్నారు. సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ, దక్షిణాంధ్ర, గోదావరి, ఉత్తరాంధ్ర.. ఇలా ఐదు ప్రాంతాల్లో జోనల్‌హబ్‌లకు కేంద్రంగా అమరావతి మారనుందన్నారు. నెలకు రాష్ట్రంలో ఎంతమందికి ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో అధికారులు పని చేయాలని సీఎం ఆదేశించారు. పాలసీ ప్రకటన అనంతరం జిల్లా కలెక్టర్లు కూడా వర్క్ స్టేషన్ల ఏర్పాటుకు అనువైన ప్రదేశాలను గుర్తించాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో రాష్ట్రంలో ఎంతమంది వర్క్ ఫ్రం హోం కింద పనిచేస్తున్నారో లెక్కించాలన్నారు. ఐటీ క్యాంపస్ 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేయాలని సూచించారు. 30 కోట్ల టర్నోవర్ కానీ కనీసం 100 మందికి ఉద్యోగాలు కల్పించే ఐటీ సంస్థలకు ప్రోత్సాహకాలు ఇచ్చేలా తుది ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వివరించారు.
READ MORE: Maharashtra Election Results: మహారాష్ట్ర ఎన్నికల్లో ముస్లిం ఓటర్ల ప్రభావం ఏమైంది..?