AP CM Chandrababu: భారీ వర్షాలు, వరదలు, జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితులపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సీఎస్, డీజీపీ, మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేశారు. జిల్లాలు, శాఖల వారీగా తాజా పరిస్థితులు, తీసుకుంటున్న చర్యలపై చంద్రబాబు రివ్యూ చేశారు. డ్రోన్లు, సీసీ కెమెరాల ద్వారా రియల్ టైంలో పరిస్థితిపై అధికార యంత్రాంగం స్పందించాలని సీఎం ఆదేశించారు. మీడియాలో, సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూప్‌లలో వచ్చే విజ్ఞప్తులపై తక్షణ స్పందన ఉండాలన్నారు. వరద తగ్గిన వెంటనే పంటనష్టంపై వివరాలు సేకరించాలని వ్యవసాయ శాఖ అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. సాయంత్రానికి ప్రకాశం బ్యారేజ్‌కు 9 లక్షల క్యూసెక్కుల పైచిలుకు వరద వస్తుందని అంచనా వేస్తున్నారు.
Read Also: Minister Gottipati Ravi kumar: భారీ వర్షాలు.. విద్యుత్ శాఖ నష్టంపై మంత్రి సమీక్ష
నిన్నటితో పోల్చుకుంటే జిల్లాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం వర్షాల తీవ్రత తగ్గిందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఇంకా వరదలోనే ఇళ్లు, కాలనీలు ఉన్నాయన్నారు. రహదారులపైనున్న నీటికి బయటకు పంపడమే కాదు.. కాలనీలు, ప్రజల ఇళ్లలో ఉన్న వరద సమస్యను పరిష్కరించాలన్నారు. పలు ప్రాంతాల్లో 27 సెంటీమీటర్లకు పైగా వర్షం పడిందని.. ఇలాంటి చోట్ల పరిస్థితిపై ఫోకస్ పెట్టాలన్నారు. 50 ఏళ్లలో ఎప్పుడూ పడనంతగా వర్షం పడిందని.. ఎప్పుడూ లేని విధంగా నేషనల్ హైవేలు కూడా వరద నీటితో చెరువులను తలపించాయన్నారు. నేషనల్ హైవే అథారిటీకి కూడా లేఖ రాసి సమస్యపై సమన్వయంతో పని చేయాలని అధికారులను ఆదేశించారు. వరద ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా పరిస్థితిని సమీక్షించాలన్నారు. వర్షాలు, వరదల కారణంగా ఆహారం, నీరు కలుషితం అవుతుందని.. గ్రామాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలన్నారు. నివాస ప్రాంతాల మధ్య నుంచి వరద నీటిని వీలైనంత త్వరగా లేకుండా చేయాలని సూచించారు. వ్యాధులు ప్రబలకుండా బ్లీచింగ్ చల్లడంతో పాటు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
Read Also: Nagarjuna Sagar: మళ్లీ కృష్ణమ్మ పరవళ్లు.. నాగార్జున సాగర్ 26 గేట్లు ఎత్తివేత…
క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్న మంత్రులతో చంద్రబాబు టెలీ కాన్పరెన్స్ నిర్వహించారు. బుడమేరు వరద వల్ల పలు ప్రాంతాలు ముంపు బారిన పడ్డాయని మంత్రి నారాయణ తెలిపారు. ఇరిగేషన్ సహా ఇతర శాఖల అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం కోసం ప్రయత్నించాలని సీఎం చంద్రబాబు సూచించారు. నూజివీడు నియోజకవర్గంలో రికార్డు స్థాయి వర్షాలకు జరిగిన నష్టాన్ని మంత్రి కొలుసు పార్థసారధి వివరించారు. ఇబ్బందుల్లో ఉన్న పలు ప్రాంతాల వారికి బియ్యం, నిత్యావసరాలు సరఫరా చేసినట్లు మంత్రి నాదెండ్ల వివరించారు. వరదలపై వ్యవసాయ శాఖ తరుపున తీసుకుంటున్న చర్యలనుమంత్రి అచ్చెన్నాయుడు వివరించారు. వరద తగ్గిన తరువాత ఆస్తి, పంటనష్టం వివరాలు సేకరించాలని.. రైతులకు, కుటుంబాలకు వెంటనే సాయం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.