NTV Telugu Site icon

CM Chandrababu: వైద్యారోగ్య శాఖపై సీఎం సమీక్ష.. ఫేక్ సదరం సర్టిఫికెట్లపై సీరియస్

Chandrababu

Chandrababu

CM Chandrababu: వైద్యారోగ్య శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఫేక్ సదరం సర్టిఫికెట్లపై ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఫేక్ సదరం సర్టిఫికెట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అంగవైకల్యంతో బాధపడేవారికి వివిధ రూపాల్లో పెన్షన్ అందిస్తున్నామని.. సదరం ఫేక్ సర్టిఫికేట్ల జారీపై చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఫేక్ సదరం సర్టిఫికెట్ల గురించి పూర్తిస్థాయిలో సమాచారం సేకరించాలన్నారు. పంచాయతీ రాజ్ శాఖతో సమన్వయం చేసుకుని ఫేక్ సదరం సర్టికెట్ల కట్టడికి చర్యలు తీసుకోవాలన్నారు. దేశంలోనే బెస్ట్ హాస్పిటళ్లుగా సర్కారు దవాఖానాలను తీర్చిదిద్దాలని సూచించారు.

వైద్య ఆరోగ్య శాఖలో ఉత్తమ విధానాలు అమలు చేయాలని.. టెలి మెడిసిన్ ద్వారా మెరుగైన వైద్య సేవలందించాలని సీఎం పేర్కొన్నారు. గత ప్రభుత్వం ప్రభుత్వాసుపత్రులను భ్రష్టుపట్టించడంతో ప్రజల్లో నమ్మకం సన్నగిల్లిందన్నారు. కిడ్నీ బాధితుల వివరాలు మండలాల వారీగా సేకరించాలన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో పరిశుభ్రత తప్పనిసరి అని.. రోగులకు శుభ్రమైన బెడ్ షీట్లు అందించాలన్నారు. రాష్ట్రంలో డోలీ మోతలు కనిపించకూడదన్నారు. ఫీడర్ అంబులెన్సుల ద్వారా రోగులను తరలించాలన్నారు. ఫీడర్ అంబులెన్సులు వెళ్లగలిగినా.. సాధ్యం కాదని నిర్లక్ష్యం వహిస్తే నేరుగా తానే ఆ ప్రాంతాన్ని సందర్శిస్తానన్నారు.104 అంబులెన్సుల పట్ల ప్రజల్లో సంతృప్తి ఉందా లేదా అన్నది ముఖ్యమని సీఎం వెల్లడించారు. ఏదో వెళ్లి కొన్ని టెస్టులు చేసి వచ్చి మొత్తం పరిష్కరించామని చెప్పడం సరి కాదన్నారు.

Read Also: Anna Canteens: అన్న క్యాంటీన్ల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్

నియోజకవర్గం స్థాయిలో పీపీపీ విధానంలో ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని.. ఆ ఆస్పత్రులకు ప్రభుత్వమే స్థలం అందిస్తుందన్నారు. ప్రభుత్వ, పీపీపీ ఆసుపత్రులను ఒకే గొడుగు కిందకు తీసుకొస్తామని సీఎం చెప్పుకొచ్చారు. క్యాన్సర్‌పై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. వైద్యారోగ్య శాఖలో 2014-19 మధ్య అమలు చేసిన ఉత్తమ విధానాలను మళ్లీ ప్రవేశపెట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం తరపున యాప్ రూపొందించి హెల్త్ కార్డు ద్వారా ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన వ్యక్తికి సంబంధించిన వివరాలు పొందుపరచాలన్నారు. ఆసుపత్రి రోగికి అందించే వైద్య సేవలు, ఎక్విప్ మెంట్, ఇచ్చే మెడిసిన్ వివరాలు కూడా ఉండాలన్నారు. ఇలా చేయడం వల్ల ఆసుపత్రి పనితీరు ఎలా ఉందో తెలుస్తుందన్నారు. రాష్ట్రంలో కిడ్నీ బాధితులు ఎంత మంది ఉన్నారో మండలాల వారీగా వివరాలు సేకరించాలని.. కిడ్నీ సమస్య కారణాలపై అధ్యయనం చేయాలని.. కిడ్నీ వ్యాధులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న నీటి సదుపాయంపైనా లోతైన అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.

Read Also: Ambati Rambabu: తుంగభద్ర గేటు కొట్టుకుపోవడాన్ని జగన్ అకౌంట్‌లో వేయడం దారుణం

గతంలో ఉద్దానంలో పూర్తిస్థాయిలో రీసెర్చ్ చేయడం వల్లే పూర్తి స్థాయిలో సమస్యను గుర్తించగలిగామన్నారు. ఉద్దానంలాగే ఇప్పుడు మరికొన్ని ప్రాంతాల్లో కిడ్నీ సమస్యలు తలెత్తుతున్నాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.పేదలకు అందుబాటులో ఉండేలా సిటీ స్కాన్ సర్వీసెస్‌ను ముందుగా అన్ని జిల్లా కేంద్ర ఆసుపత్రుల్లో ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ప్రీ ల్యాబ్ టెస్ట్‌ల అనంతరం పేషెంట్లకు సరైన విధానంలో మెడిసిన్ ఇవ్వగలిగితే 50 శాతం కంట్రోల్ చేయొచ్చన్నారు. రోగులకు డైట్ ప్లాన్, న్యూట్రిషన్ పై అవగాహన కల్పించగలిగితే వ్యాధుల నుండి కాపాడవచ్చన్నారు రాష్ట్రంలో టీబీ రోగులు ఎంతమంది ఉన్నారో సమగ్ర అధ్యయనం చేసి వారికి కంటిన్యూగా మెడిసిన్ అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు.

“ఆసుపత్రులలో ప్రసవం తర్వాత శిశువుల మిస్సింగ్ కేసులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మిస్సింగ్ కేసులు వస్తే అధికారులపై చర్యలు తప్పవు. ఎన్టీఆర్ బేబీ కిట్స్ ను మళ్లీ తల్లులకు అందించాలి. బేబీలకు అవసరమైన సామాగ్రిని కిట్స్ ద్వారా అందించాలి. ప్రతి స్కూలులో పిల్లలకు కంటి పరీక్షలు చేసిన తర్వాత ఏం యాక్షన్ తీసుకున్నారో రిపోర్టు చేయాలి. టెలీ మెడిసిన్ కు గతంలో వరల్డ్ బ్యాంకు నుండి రూ.2,300 కోట్లు నిధులు తీసుకొచ్చాం. కార్పొరేట్ లెవల్లో సేవలు అందించాలని నిర్ణయించాం. గ్రామాల్లో ఉండేవారికి టెలీ మెడిసిన్ ద్వారా మంచి డాక్టర్లతో అందించాలని నిర్ణయించాం. కానీ దాన్ని గత ప్రభుత్వం సరిగా అమలు చేయలేదు. టెలీ మెడిసిన్ పై ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ఉత్తమ విధానాలు అధ్యయనం చేసి రాష్ట్రంలో అమలు చేసేలా యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలి.” అని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.