CM Chandrababu: ఏపీలో వరద సహాయక చర్యలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వరద పరిస్థితి, సహాయక చర్యలు జరుగుతున్న తీరుపై ఆరా తీశారు. బాధితుల వద్దకు రెస్క్యూ బృందాలు వెళ్లేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. వరద బాధితులను పునరావాస శిబిరాలకు తరలించాలన్నారు. సహయక బృందాలు తమ వద్దకు రాలేదన్న మాటే బాధితుల నుంచి రాకూడదని సీఎం ఆదేశాలు జారీ చేశారు. అంటు వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని చంద్రబాబు సూచించారు. గర్భిణుల తరలింపుపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. బాధితుల్లో గర్భిణులు ఉంటే వారిని సమీప ఆస్పత్రికి తరలించాలని ఆదేశించారు. వృద్ధులు, మహిళలు, చిన్నారుల తరలింపులో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సీఎం సూచించారు. పునరావాస శిబిరాలను పరిశుభ్రంగా ఉంచాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.
Read Also: Musi River: ఉప్పొంగుతున్న మూసీ నది.. భయం గుప్పిట్లో ప్రజలు..
ఏపీ, ఒడిశా భూ ఉపరితలంపై వాయుగుండం కొనసాగుతోంది. విశాఖకు ఉత్తర వాయవ్యంగా 90కి.మీ దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. మరో 24 గంటల పాటు వాయుగుండం ప్రభావం కొనసాగునున్నట్లు వాతావరణ విభాగం వెల్లడించింది. ఆ తర్వాత బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారుతుందని ఐఎండీ అంచనా వేసింది. తెలంగాణపై వాయుగుండం అత్యధిక ప్రభావం చూపించినుంది. గడిచిన 24 గంటల్లో మహబూబాబాద్‌లో 37సెం.మీ, కోదాడ 35, మణుగూరు, కూచుమంచి 32 చిలుకూరు 31, హుజూర్నగర్, మఠంపల్లిలో 30 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఏపీలో రేపటి నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
