ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కుప్పం పర్యటనలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. వాతావరణ పరిస్థితులు, వ్యవసాయం, నీటి సంరక్షణతో పాటు నియోజకవర్గ అభివృద్ధి, రాజకీయ అంశాలపై మాట్లాడారు. తాను రాష్ట్రమంతా తిరుగుతా అని, రైతులను చైతన్యం చేస్తా అని చెప్పారు. ఈ ఏడాది నీళ్లు తక్కువగా ఉన్నాయని, వరి వేస్తే నష్టపోతాం అని రైతులకు సీఎం సూచించారు. రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని ప్రభుత్వం ఇప్పటికే సమీక్షలు నిర్వహిస్తోంది.
‘ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది తీవ్రమైన ఎండలు ఉండే అవకాశం ఉంది. వేడి తీవ్రతను తగ్గించేందుకు పెద్ద ఎత్తున చెట్లు పెంచాలి. ఎల్‌నినో పరిస్థితులను అందరూ కలిసి ఎదుర్కోవాలి. నీటి వనరులు పరిమితంగా ఉన్నందున వ్యవసాయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నీటి కొరత ఉన్న సమయంలో వరి సాగు చేస్తే రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. ప్రత్యామ్నాయంగా మిల్లెట్లు, పప్పుధాన్యాలు వంటి పంటలను సాగు చేస్తే రైతులకు ఆదాయంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా లభిస్తాయి. నీటి లభ్యతకు అనుగుణంగా పంటల విధానంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది’ అని సీఎం చంద్రబాబు చెప్పారు.
కుప్పం అభివృద్ధిలో భాగంగా మౌలిక వసతులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని సీఎం చంద్రబాబు తెలిపారు. కుప్పంలో త్వరలో ఎయిర్‌పోర్టు పనులు ప్రారంభిస్తామని చెప్పారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే మరో రెండు రైళ్లను కుప్పంలో నిలిపేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కుప్పం-బెంగళూరు కొత్త రహదారి పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. కుప్పం నుంచి చిత్తూరు, తిరుపతికి నేరుగా రైలు సౌకర్యం కల్పించాలని కేంద్ర మంత్రిని కోరినట్లు వెల్లడించారు. రవాణా సౌకర్యాలు మెరుగుపడితే కుప్పం అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని సీఎం అన్నారు. కుప్పం నియోజకవర్గంలో భూ సమస్యలను పరిష్కరించడంపై కూడా సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే మార్చిలోగా కుప్పంలో ఏ ఒక్కరికీ భూ సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాజముద్రతో పట్టాదారు పుస్తకాలు అందిస్తామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా భూ రికార్డుల సంస్కరణ, కొత్త పట్టాదారు పాస్‌బుక్‌ల జారీకి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు ఇప్పటికే ప్రకటించింది.
కుప్పంలో రాజకీయ పరిస్థితులపై సీఎం చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2019-24 మధ్య కుప్పాన్ని రౌడీలకు అడ్డాగా మార్చారని ఆరోపించారు. తాను తన ఇంటికి వచ్చిన సమయంలో కూడా తనను అడ్డుకున్నారని, ఆ విషయాన్ని మర్చిపోలేదని అన్నారు. వైసీపీ ఎమ్మెల్సీ చేసినట్లు తాను పేర్కొన్న ‘చంపడానికి, చావడానికి సిద్ధం’ వంటి వ్యాఖ్యలను ప్రస్తావించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. ‘ఇది మంచి వాళ్లు ఉండే అడ్డా.. నేరస్థులకు చోటు లేదు’’ అని వ్యాఖ్యానించారు. నేరాలకు పాల్పడేవారు తమకు అనుకూలమైన ప్రాంతాలకు వెళ్లాలని, లేకపోతే ప్రజలే తరిమికొడతారని అన్నారు. ‘మీకు శాంతి కావాలా? రౌడీయిజం కావాలా?’’ అంటూ సభకు హాజరైన ప్రజలను చంద్రబాబు ప్రశ్నించారు. రాజకీయాల్లో హింసాత్మక వ్యాఖ్యలకు తావు ఉండకూడదని పేర్కొన్నారు. ‘రక్తాభిషేకం చేస్తాం’ వంటి మాటలు వింటే ఆశ్చర్యంగా ఉందని వ్యాఖ్యానించారు. తన పాలనలో అవినీతికి చోటు ఉండదని సీఎం అన్నారు. ఎక్కడ చంద్రబాబు ఉంటే అక్కడ అవినీతి జరిగే ప్రసక్తే లేదని వ్యాఖ్యానించారు. కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి, మౌలిక వసతులు, వ్యవసాయం, రవాణా తదితర రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని సీఎం తెలిపారు.

