CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులను వేగవంతం చేయడంపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. శనివారం తన క్యాంప్ కార్యాలయంలో మంత్రి నారాయణ, సీఆర్డీఏ (CRDA), ఏడీసీ (ADC) ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం రాజధానిలో సుమారు రూ. 57,821 కోట్ల విలువైన వివిధ పనులు సాగుతున్నాయని, వీటిని నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.
రాజధానిలో కీలకమైన హౌసింగ్, రోడ్లు, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎల్పీఎస్ పనులతో పాటు అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం వంటి ఐకానిక్ భవనాల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. గత ప్రభుత్వం నిలిపివేసిన లేదా రద్దు చేసిన పనులకు సంబంధించి ఉన్న వివాదాలు, సమస్యలను పరిష్కరించి, సీఆర్డీఏ మళ్లీ టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి పనులను అప్పగించినట్లు ఈ సమావేశంలో చర్చించారు. పెరిగిన నిర్మాణ వ్యయం వంటి సవాళ్లను అధిగమించి పనులు ముందుకు సాగుతున్నాయని అధికారులు వెల్లడించారు.
సమీక్షా సమావేశంలో సీఎం నిర్మాణ సంస్థల ప్రతినిధులతో కీలక వ్యాఖ్యలు చేశారు. “రాజధాని నిర్మాణాన్ని కేవలం ఒక కాంట్రాక్ట్ వర్క్ లాగా చూడొద్దు. ఈ అద్భుత నగరాన్ని నిర్మించే ప్రతి ఒక్కరూ చరిత్రలో భాగస్వాములు అవుతున్నారు. రాజధానిని నిర్మించే అవకాశం అందరికీ దక్కదు, దీనిని ఒక గొప్ప అవకాశంగా భావించి వినూత్నంగా నిర్మించాలి” అని అన్నారు. అమరావతిని ఒక ‘ఫ్యూచర్ సిటీ’గా మార్చాలనే ప్రభుత్వ ఆలోచనను క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత మీపైనే ఉందని స్పష్టం చేశారు.
రాజధాని పనుల పురోగతిపై సీఎం కొన్ని కీలక మార్గదర్శకాలను జారీ చేశారు. ఇందులో భాగంగా ప్రతి నిర్మాణం అత్యున్నత నాణ్యతతో ఉండాలని., నిర్మాణాల్లో గ్రీన్ ఎనర్జీతో పాటు అత్యాధునిక టెక్నాలజీని వినియోగించుకోవాలన్నారు. వారం, నెలవారీ టార్గెట్లు పెట్టుకుని పనులు పూర్తి చేయాలని, వర్షాకాలం వచ్చేలోపు పూర్తి చేయాల్సిన పనులపై అధికారులు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రస్తుతం 20 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు, పనుల వేగం పెంచేందుకు మ్యాన్ పవర్‌ను మరింత పెంచుకోవాల్సిన అవసరం ఉందని సీఎం సూచించారు.
నిర్మాణ పనుల్లో ఏ మాత్రం రాజీ పడబోమని, ప్రభుత్వం నిర్ణయించిన సమయానికి ప్రతి నిర్మాణం పూర్తి కావాలని సీఎం అధికారులకు సూచించారు. నిర్మాణ సంస్థలకు ఏవైనా వినూత్న ఆలోచనలు వస్తే వాటిని ప్రభుత్వంతో పంచుకోవచ్చని, రాజధాని ప్రతిష్టను పెంచేలా అందరూ కలిసి పనిచేయాలని కోరారు. ఖర్చు తగ్గించే (Cost effective) చర్యలు తీసుకుంటూనే, అద్భుతమైన ఫలితాలను సాధించాలని అధికారులను మరియు కాంట్రాక్టర్లను చంద్రబాబు ఆదేశించారు.
