CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారణాసి పర్యటనలో ఉన్నారు.. ఇక, ఆయన శ్రీ కాశీ విశ్వనాథ స్వామివారిని దర్శించుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ 25 ఏళ్ల ప్రజా జీవితాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప అభియాన్’ కార్యక్రమంలో భాగంగా ఆయన కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి సీఎం చంద్రబాబు ఆలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా శ్రీ కాశీ విశ్వనాథుడికి పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు.
ఇక, పూజల అనంతరం ఆలయ పండితులు సీఎం చంద్రబాబుకు ఆశీర్వచనం అందించారు. అర్చకులు ఆయనకు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, చిరాగ్ పాశ్వాన్, యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి చంద్రబాబు భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ప్రధాని మోడీ 25 ఏళ్ల ప్రజా జీవితాన్ని పురస్కరించుకుని ‘సేవా సంకల్ప అభియాన్’లో భాగంగా వారణాసి నుంచి వాద్నగర్ వరకు సేవా యాత్ర నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కాశీ విశ్వనాథ ఆలయంలో జలాభిషేకం నిర్వహించడం ప్రధాన కార్యక్రమాల్లో ఒకటిగా ఉంది. వారణాసి-వాద్నగర్ మధ్య నిర్వహిస్తున్న సేవా సంకల్ప బైక్ యాత్రలో భాగంగా పవిత్ర జలాలను తీసుకెళ్లే కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు.
వారణాసిలో జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, సానా సతీష్ కూడా పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ నిర్వహిస్తున్న ఈ నెలరోజుల కార్యక్రమాలు సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు కొనసాగనున్నాయి. కాగా, ‘వారణాసి-వాద్నగర్ సేవాయాత్ర’లో పాల్గొనేందుకు వారణాసి వెళ్లిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి యూపీ ప్రభుత్వ ప్రతినిధులు స్వాగతం పలికారు. అనంతరం కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు.. ఆ తర్వాత కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్నారు.

