NTV Telugu Site icon

Chandrababu: విద్యా కానుక కిట్లను త్వరగా పంపిణీ చేయాలి.. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం

Chandrababu

Chandrababu

Chandrababu: ఏపీలో నేటి నుంచి పాఠశాలలు ప్రారంభమయ్యాయి. దీంతో విద్యార్ధులు భారీ సంఖ్యలో స్కూళ్లకు హాజరవుతున్నారు. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే అధికారుల నుంచి పాఠశాలలకు ఆదేశాలు అందాయి. ఇందులో భాగంగా విద్యా కానుక కిట్లను ఎప్పటిలాగే విద్యా సంవత్సరం ప్రారంభం రోజే అందజేస్తున్నారు. విద్యా కానుక కిట్లను ఆలస్యం చేయకుండా విద్యార్ధులకు త్వరితగతిన పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. స్కూల్ బ్యాగులపై పార్టీ రంగులు ఉన్నప్పటికీ వాటినీ కూడా పంపిణీ చేయాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం స్కూల్ బ్యాగులను పార్టీ రంగులతో ముద్రించినా వృథా చేయకుండా విద్యార్ధులకు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు సీఎం చంద్రబాబు.

Read Also: CM Chandrababu: పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 36 లక్షల మంది విద్యార్ధులకు విద్యా కానుక కిట్లు పంపిణీ చేయాల్సిందిగా సూచించారు. విద్యా కానుక కిట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 700 కోట్లు వెచ్చించింది. ఎన్నికల షెడ్యూల్ విడుదల సమయంలో టెండర్లు పిలవటంతో స్కూలు బ్యాగులపై గుర్తులు ముద్రించలేదని అధికారులు తెలిపారు. ఏపీ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు వాస్తవానికి నిన్ననే(బుధవారం) పునఃప్రారంభం కావాల్సి ఉంది. అయితే కొత్త ప్రభుత్వ ప్రమాణస్వీకారం నేపథ్యంలో ఒక రోజు ఆలస్యంగా పాఠశాలలను ప్రారంభించాలని విజ్ఞప్తులు వచ్చాయి. ఈ క్రమంలో సర్కారు ఇవాళ్టి నుంచి పాఠశాలలు తెరవాలని ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలతో ఇవాళ పాఠశాలలు తెరచుకున్నాయి. కొన్నేళ్లుగా కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం రోజే విద్యా కానుక కిట్లు అందజేస్తుండటంతో ఈసారి కూడా అదే చేస్తున్నారు. వాస్తవానికి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తయారు చేయించిన విద్యా కానుక కిట్లను కొత్త ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా మార్చి ఇచ్చేందుకు సమయం సరిపోలేదు. దీంతో ఇప్పటికే కొనుగోలు చేసిన కిట్లనే పంపిణీ చేసేందుకు వీలుగా కొత్త ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీంతో పార్టీ రంగులతో ఉన్న కిట్లనే విద్యార్ధులకు ఈసారికి ఇస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నాటికి విద్యా కానుక కిట్లు, పేర్లలో మార్పులు చేసే ఛాన్స్ ఉంది.