CM Chandrababu in Kuppam: కుప్పం నియోజకవర్గం అభివృద్ధి బాటలో వేగంగా ముందుకు సాగుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కుప్పం క్రమంగా ‘స్వర్ణ కుప్పం’గా మారుతోందని పేర్కొన్నారు. వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. తన సొంత నియోజకవర్గ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం కుప్పంలో నిర్వహించిన ‘స్వర్ణ కుప్పం’ బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. కుప్పం పర్యటనలో రూ.289.5 కోట్ల విలువైన పనులను ప్రారంభించడంతో పాటు రూ.38.5 కోట్ల పనులకు శంకుస్థాపనలు చేయనున్నట్లు ముందుగా ప్రకటించారు.
తనకు కుప్పంతో ఉన్న అనుబంధాన్ని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ‘నారావారిపల్లె నాకు జన్మనిస్తే.. కుప్పం రాజకీయ జన్మనిచ్చింది. కుప్పం నా గుండెల్లో ఎప్పుడూ ఉంటుంది. నియోజకవర్గ ప్రజలతో నాది కుటుంబ అనుబంధం, ప్రతి ఇంట్లో నన్ను కుటుంబ సభ్యుడిలా చూసుకుంటున్నారు. ఇది నా పూర్వజన్మ సుకృతం. నన్ను 40 ఏళ్లుగా ఎమ్మెల్యేగా కుప్పం ప్రజలు ఆదరిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నా.. ముందుగా కుప్పంలోనే ప్రారంభించేందుకు ప్రాధాన్యత ఇస్తా. కుప్పం అభివృద్ధిని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేలా ప్రణాళికలు రూపొందిస్తున్నా’ అని చంద్రబాబు చెప్పారు.
కుప్పం అంటే ముందుగా గుర్తుకు వచ్చేది గ్రానైట్ అని సీఎం చంద్రబాబు అన్నారు. రానున్న రోజుల్లో కుప్పం గ్రానైట్‌తో తయారు చేసిన వస్తువులను ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేసే స్థాయికి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. కుప్పంలో పరిశ్రమలు, మౌలిక వసతులు, ఉపాధి అవకాశాలను పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. ఇప్పటికే కుప్పంలో పారిశ్రామిక పెట్టుబడులకు సంబంధించిన పలు కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టింది. స్వర్ణ కుప్పం విజన్ 2029లో భాగంగా నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి మాస్టర్ ప్లాన్‌పై ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించింది. వ్యవసాయం, పర్యాటకం, మౌలిక వసతులు, పరిశ్రమలు తదితర రంగాల్లో అభివృద్ధి అవకాశాలపై ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు గతంలో ప్రభుత్వం వెల్లడించింది.

