Site icon NTV Telugu

Cholera-Tenali: తెనాలిలో కలరా కలకలం.. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌కు..!

Cholera Tenali

Cholera Tenali

గుంటూరు జిల్లా తెనాలి మండలంలో మహమ్మారి ‘కలరా’ కలకలం రేపుతోంది. అంగలకుదురు గ్రామంలోని రైల్వే స్టేషన్ రోడ్డులో ఓ మహిళకు కలరా వ్యాధి నిర్ధారణ అయింది. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అయిన సదరు మహిళ ప్రస్తుతం తాడేపల్లిలోని మణిపాల్‌ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. మహిళ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని, మరో 2-3 రోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. మహిళకు కలరా వ్యాధి నిర్ధారణ కావడంతో వైద్యారోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి…

అంగలకుదురు గ్రామానికి చెందిన ఇంటూరి దీపిక (33) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. హైదరాబాద్‌లో ఆమె డెంగ్యూతో బాధపడుతూ.. ఈనెల 14న స్వగ్రామం అంగలకుదురుకు వెళ్లారు. చికిత్స తీసుకున్నా వాంతులు, విరేచనాలు తగ్గలేదు. ఈనెల 18న దీపిక డయేరియా లక్షణాలతో బాధపడుతూ.. తాడేపల్లిలోని మణిపాల్‌ వైద్యశాలలో చికిత్స నిమిత్తం చేరారు. 19న ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా.. కలరా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. అప్రమత్తమైన వైద్యారోగ్య శాఖ అధికారులు ఆమెకు మెరుగైన చికిత్స అందించారు.

Also Read: CM Chandrababu: మహారాష్ట్ర, యూపీని అధిగమించి.. ఏపీ నెంబర్‌వన్‌ కావాలి!

అంగలకుదురు గ్రామంలో వైద్యారోగ్య శాఖ అధికారులు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. వైద్య సిబ్బంది ఇంటింటికి తిరిగి సర్వే నిర్వహించారు. ఆదివారం వరకు వైద్య శిబిరం నిర్వహించారు. ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు గ్రామంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. 1100 ఇళ్లలో నాలుగు వేల మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎవరికీ కలరా ఆనవాళ్లు లేవు. దాంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం గ్రామంలో పరిస్థితి అంతా అదుపులోనే ఉందని, భయపడాల్సింది ఏమీ లేదని అధికారులు చెబుతున్నారు.

Exit mobile version