NTV Telugu Site icon

Chinta Mohan: కాపులు అందరూ కాంగ్రెస్‌లోకి రావాలి.. చిరంజీవిని అసెంబ్లీలో చూడాలి..!

Chinta Mohan

Chinta Mohan

Chinta Mohan: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు అప్పుడే హీట్‌ పుట్టిస్తున్నాయి.. అన్ని పార్టీలు విజయమే లక్ష్యంగా తమ వ్యూహాలు సిద్ధం చేస్తున్నా్యి.. ఇక, రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కనుమరుగైన కాంగ్రెస్‌ పార్టీ.. మళ్లీ పూర్వవైభవం కోసం ప్రయత్నాలు చేస్తు్ంది.. అందులో భాగంగా దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ షర్మిలకు ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి కట్టబెట్టింది.. ఇక, ఇతర పార్టీల నేతలతో పార్టీలోకి ఆహ్వానించే పనిలో పడిపోయారు కాంగ్రెస్‌ నేతలు.. ఇప్పటికే మెగాస్టార్‌ చిరంజీవి పొలిటికల్‌ రీఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్‌.. ఈ రోజు రాజమండ్రిలో మాట్లాడుతూ.. కాపులను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని.. కాపులు అందరూ కాంగ్రెస్ లోకి రావాలని నిలుపునిచ్చారు. అంతేకాదు.. చిరంజీవి కూడా కాంగ్రెస్ లోకి రావాలని, ఆయన్ని అసెంబ్లీలో చూడాలని ఉందన్నారు.. చిరంజీవిని తిరుపతి నుంచి పోటీ చేయమని కోరుతున్నామని అన్నారు. ఇక, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని ఆశాభవం వ్యక్తం చేశారు. వైఎస్ షర్మిలను పీసీసీ అధ్యక్షురాలుగా కాంగ్రెస్ అధిష్టానం మంచి నిర్ణయం తీసుకుందని, ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు పార్టీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్‌.

Read Also: Hanu Man Collections: రికార్డ్ బ్రేకింగ్ వసూళ్లను రాబట్టిన ‘హనుమాన్’.. 10 రోజుల్లో ఎన్ని కోట్లంటే?

కాగా, ఈ మధ్యే చిరంజీవి కాంగ్రెస్‌లో చేరాలని.. తిరుపతి నుంచి పోటీ చేయాలని చింతా మోహన్ వ్యాఖ్యానించిన విషయం విదితమే.. తిరుపతి నుండి ఎమ్మెల్యేగా చిరంజీవి పోటీ చేయాలని కోరనున్నట్టు తెలిపిన ఆయన.. అంతేకాదు మా ముఖ్యమంత్రి అభ్యర్థి చిరంజీవియే ఉంటారని స్పష్టం చేశారు. కాపులకు ఇదే సరైనా సమయమని పిలుపునిచ్చారు. ఇక, చిరంజీవిని నేనే స్వయంగా పార్టీలో ఆహ్వానిస్తానని పేర్కొన్నారు.. చిరంజీవి 50 వేలకు పైగా మెజారిటీతో గెలుస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. నామినేషన్‌ వేసి వెళ్లిపోతే చాలు.. ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు.. ప్రజలు చిరంజీవికి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అంతేకాదు.. గతంలో రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కాకుండా చిరంజీవి.. సీఎం అయిఉంటే బాగుండేదని ఆ మధ్య చింతా మోహన్ అభిప్రాయం వ్యక్తం చేసిన విషయం విదితమే..