NTV Telugu Site icon

Corona Deaths: చైనాలో చిన్నారుల ప్రాణాలు తీస్తున్న లాక్ డౌన్

Corona Deaths: చైనా ప్రభుత్వం కరోనా ఆంక్షాలను కఠినతరం చేసింది. ఒక్కకేసు వచ్చినా ఆ ప్రాంతాన్ని కట్టడి చేస్తోంది. కరోనా లక్షణం అనిపిస్తే ఏ ఒక్కరినీ బయట తిరగనీయకుండా క్వారంటైన్ చేస్తుంది. జీరో కొవిడ్ విధానాన్ని అనుసరిస్తున్న చైనా లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తోంది. అత్యవసర పరిస్థితుల్లోనూ దేశ పౌరులను బయటకు వెళ్లకుండా కట్టడి చేస్తోంది. దీంతో క్వారంటైన్‌లో ఉన్న చిన్నారులకు అత్యవసర సమయంలో చికిత్స అందకపోవడంతో మృత్యువాత పడుతున్నారు. ప్రభుత్వం మరీ కఠినంగా వ్యవహరిస్తుండడంపై ప్రజలు తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అధికారులపై తిరగబడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. కరోనా మహమ్మారి ఝేంగ్‌జువా నగరంలో ఇటీవల వ్యాప్తి చెందుతుండడంతో లక్షలాదిమంది ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.

Read Also: Gold Rate Today: రాకెట్‎లా దూసుకెళ్లిన బంగారం ధర.. ఏకంగా 7నెలల గరిష్టానికి పెంపు

కరోనా లక్షణాలు బయటపడితే వారిని నగరానికి దూరంగా క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు అధికారులు. ఈ క్రమంలో నగరానికి దూరంగా ఓ హోటల్‌లో క్వారంటైన్‌లో గడుపుతున్న ఓ కుటుంబంలోని చిన్నారి అస్వస్థతకు గురైంది. వాంతులు, విరేచనాలతో బాధపడుతుండడంతో అత్యవసర వైద్య చికిత్స కోసం ప్రయత్నించారు. కరోనా ఆంక్షలని చెప్పి ఆ చిన్నారిని చికిత్స చేయించుకునేందుకు కూడా అధికారులు అంగీకరించలేదు. దీంతో పాప పరిస్థితి మరింత విషమంగా మారింది. దాదాపు 11 గంటలపాటు ప్రాధేయపడిన తర్వాత 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసుపత్రికి పాపను తీసుకెళ్లేందుకు అధికారులు ఆ కుటుంబానికి అనుమతిచ్చారు. కానీ చిన్నారి అప్పటికే చనిపోయింది. ఇలాంటి ఘటన లాంఝువాలో జరిగింది. క్వారంటైన్‌లో ఉన్న మూడేళ్ల చిన్నారి అస్వస్థతకు గురికాగా ఆసుపత్రికి తీసుకెళ్లకుండా అధికారులు అడ్డుకున్నారు. దీంతో బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రజల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. అధికారుల తీరును నిరసిస్తూ రోడ్లపైకి వచ్చి బారికేడ్లను తొలగించారు. సోషల్ మీడియాలోనూ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు. దీంతో స్పందించిన అధికారులు క్వారంటైన్‌లో ఉన్న వారికి అత్యవసర వైద్య సేవలకు ఆటంకం కలిగించబోమని హామీ ఇచ్చారు.