China: హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే ఇరాన్ గడ్డ పైనే హత్యకు గురికావడంతో ఆ దేశం ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ప్రమాణస్వీకారం కోసం వచ్చిన సమయంలో రాజధాని టెహ్రాన్‌లో హనియే హత్యకు గురయ్యాడు. అయితే, ఈ హత్యకు ఇజ్రాయిల్ బాధ్యత వహించనప్పటికీ, ఇరాన్ మాత్రం ఇది ఇజ్రాయిల్ పనే అని దీనికి ప్రతీకారం తప్పకుండా ఉంటుందని హెచ్చరించింది. ఇజ్రాయిల్‌పై దాడికి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఆదేశించినట్లుగా వార్తలు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా మిడిల్ ఈస్ట్‌లో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.
Read Also: Sheikh Hasina: ‘‘నా తల్లిని కాపాడినందుకు మోడీకి, భారత్‌కి కృతజ్ఞతలు’’.. షేక్ హసీనా కుమారుడు..
ఇదిలా ఉంటే, తాజాగా ఈ సంక్షోభ సమయంలో ఇరాన్‌కి చైనా మద్దతుగా నిలిచింది. ఇరాన్ సార్వభౌమాధికారం, భద్రత మరియు జాతీయ గౌరవాన్ని కాపాడుకోవడంలో చైనా మద్దతు ఇస్తుందని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి ఆదివారం ఇరాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రికి ఫోన్ కాల్‌లో తెలియజేసినట్లు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్యను బీజింగ్ ఖండించింది. ఈ దాడి ఇరాన్ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించిందని, ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీసిందని వాంగ్ యీ చెప్పారు.