Sheikh Hasina: బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ కోటాకు వ్యతిరేకంగా చెలరేగిన అల్లర్లు, షేక్ హసీనానా తన పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయేలా చేసింది. బంగ్లా ఆర్మీ 45 నిమిషాల అల్టిమేటంతో ఆమె హుటాహుటిన రాజధాని ఢాకాను వదిలి ఆ దేశ ఆర్మీ విమానంలో ఢిల్లీ సమీపంలోని హిండన్ ఎయిర్‌బేస్‌కి చేరారు. అయితే, తన తల్లిని రక్షించినందుకు షేక్ హసీనా కుమారుడు సజీబ్ వాజెద్ జాయ్(53) భారతదేశానికి, ప్రధాని నరేంద్రమోడీకి కృతజ్ఞతలు తెలిపారు.
బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వ అధికారు ఆ దేశంలో ‘‘ మూక పాలన’’కు అనుమతించారని ఆరోపించారు. ఈ పరిణామాలు వేగంగా ఎన్నికలు జరగకుండా గందరగోళానికి దారి తీస్తాయని హెచ్చరించారు. ప్రస్తుత తత్కాలిక ప్రభుత్వం ‘‘పూర్తిగా శక్తిలేనిది’’గా అభివర్ణించారు. ఏఏఫ్‌పీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్‌లో ‘‘ మూకపాలన’’ కొనసాగుతోందని అన్నారు. నిరసనకారుల డిమాండ్లతో ప్రధాన న్యాయమూర్తి, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్, పోలీస్ చీఫ్‌తో సహా పలువురు ఉన్నతాధికారుల తొలగింపును ఆయన ప్రస్తావించారు. రేపు ఈ గుంపు తాత్కాలిక ప్రభుత్వంలో ఉన్న వ్యక్తిని మార్చాలని కోరుకుంటే, అతడిని కూడా మార్చాల్సి ఉంటుందని అక్కడి పరిస్థితిని ఎత్తి చూపారు.
కొద్ది నెలల్లో అక్కడ ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నట్లు తాత్కాలిక ప్రభుత్వాధినేత, నోబెల్ విజేత ముహమ్మద్ యూనస్ చెప్పారు. అయితే, ఎన్నికలు ఆలస్యమైతే బంగ్లాదేశ్‌లో ప్రమాదాలు ఉంటాయని అన్నారు. ఎన్నికలు నిర్వహించిన చట్టబద్ధమైన ప్రభుత్వాన్ని తిరిగి తీసుకురావాలని ఆయన కోరారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ నేతలు, కార్యకర్తలపై కూడా మూకదాడులు జరుగుతున్నాయి. దీంతో వారంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో అవామీ లీగ్ లేకుండా బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్యాన్ని స్థాపించలేరు, దేశంలో సగం మంది ప్రజలు దీనిని ఎప్పటికీ అంగీకరించరని ఆయన అన్నారు.
షేక్ హసీనా భారత్‌లో ఎంతకాలం ఉంటుందో తెలియదని వాజెద్ చెప్పారు. ఆమె వేరే దేశానికి వెళ్లడానికి ఇప్పటికీ ఎలాంటి ప్రణాళికలు లేవని చెప్పారు. తన తల్లి ఎప్పుడూ బంగ్లాదేశ్‌ని వదలాలని అనుకోలేదని, అక్కడే పదవి విరమణ చేయాలనేదే ఆమె కల అని చెప్పారు.