Joe Biden Meets Xi Jinping: చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌లు సోమవారం ఇండోనేషియాలోని బాలిలో సమావేశమయ్యారు. అమెరికా, చైనా దేశాల మధ్య ఆర్థిక, భద్రతాపరమైన ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. కొన్నేళ్లగా ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. తైవాన్ అంశంతో పాటు కరోనా వైరస్ వెలుగు చూసిన తర్వాత ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ పరిణామాల నడుమ అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ పగ్గాలు చేపట్టిన తర్వాత జిన్‌పింగ్‌తో సమావేశం అవ్వడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇండోనేషియాలో జరుగుతున్న జీ-20 సదస్సులో భాగంగా ఇరు దేశాధినేతలు కరచాలనం చేస్తూ ఒకరినొకరు పలకరించుకున్నారు.
ఈ భేటీ ఇరుదేశాల మధ్య సంబంధాలను మెరుగుపరుస్తుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అభిప్రాయపడ్డారు. ఇరు దేశాలు పరస్పరం సహకరించుకుందామని జిన్‌పింగ్‌తో జో బైడెన్ చెప్పారు. దీనికి స్పందించిన జిన్‌పింగ్.. ఇటువంటి చర్చలు మరిన్ని జరగాలని సూచించగా, అందుకు దారులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని బైడెన్ చెప్పారు. తద్వారా వాతావరణ మార్పులు, విపత్తుల వంటి అంతర్జాతీయ సవాళ్లపై కలిసి పనిచేయవచ్చని బైడెన్ సూచించారని అమెరికా అధికారులు తెలిపారు. ఇరుదేశాలు కలిసి ప్రపంచ సమస్యలపై కలిసి పనిచేద్దామని పేర్కొన్నారు. జిన్‌పింగ్‌తో నిజాయితీగా తన అభిప్రాయాలను తెలిపేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఈ భేటీలో అధ్యక్షులతోపాటు ఇరుదేశాల విదేశాంగ మంత్రులు, రాయబారులు పాల్గొన్నారు.
G20 Summit: రెండు రోజుల పాటు జీ20 సమావేశాలు.. బాలిలో ప్రధానికి ఘనస్వాగతం
చైనా, అమెరికా దేశాధినేతల మధ్య జరుగుతున్న అత్యున్నత స్థాయి భేటీపై ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోందని జిన్‌పింగ్ అన్నారు. ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకుంటామని తెలిపారు. చైనా-యూఎస్ మధ్య తలెత్తిన విబేధాలను పరిష్కరించుకునే బాధ్యత ఇరుదేశాలపై ఉందని పేర్కొన్నారు. పరస్పర సహకారం కోసం అనువైన మార్గాలను అన్వేషిస్తున్నన్నట్లు ఆయన తెలిపారు. బైడెన్‌తో అన్నివిషయాలపై లోతుగా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాని జిన్‌పింగ్ చెప్పారు. ఈ భేటీకి ముందు మాట్లాడిన జో బైడెన్.. చైనాతో ఘర్షణ పడాలనే ఉద్దేశం తమకు ఎంత మాత్రం లేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు. ఆ దేశంతో పోటీ పడాలని మాత్రమే తాము కోరుకుంటున్నామని, ఉద్రిక్తతలు నివారించటానికి తమవైపు నుంచి సమాచార వ్యవస్థలన్నింటినీ తెరిచే ఉంచుతామని ఆదివారం తూర్పు ఆసియా సదస్సులో మాట్లాడుతూ జో బైడెన్ స్పష్టం చేశారు.