NTV Telugu Site icon

China: 6 నెలల తర్వాత చైనాలో తొలి కరోనా మరణం

China

China

China: ప్రపంచవ్యాప్తంగా కొన్నాళ్లు ప్రశాంతంగా ఉన్న కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. పలు దేశాల్లో ఆంక్షలను సడలిస్తున్నప్పటికీ చైనాలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. చైనా మాత్రం కఠిన లాక్‌డౌన్‌లు పాటిస్తోందంటే అక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. లాక్‌డౌన్‌లు విధిస్తున్నా కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా చైనాలో 6 నెలల తర్వాత మళ్లీ కొవిడ్ మరణం నమోదైంది. ఆ దేశ ఆరోగ్య శాఖ ఈ విషయాన్ని ఆదివారం అధికారికంగా ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు అక్కడ కొవిడ్‌ మృతుల సంఖ్య 5,227కు చేరుకున్నట్లు చైనా పేర్కొంది. వైరస్‌ను కట్టడి చేసేందుకు ‘జీరో కోవిడ్ పాలసీ’ పేరిట కఠిన ఆంక్షలను ఇంకా కొనసాగిస్తూనే ఉంది డ్రాగన్ దేశం.

ఈ ఏడాది మే 26న షాంఘైకు చెందిన ఓ వ్యక్తి కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే మరో వ్యక్తి వైరస్ కారణంగా చనిపోయాడు. బీజింగ్‌కు చెందిన ఓ 87ఏళ్ల వృద్ధుడు తాజాగా కొవిడ్‌తో చనిపోయినట్లు నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ వెల్లడించింది. చైనాలో దాదాపు 92 శాతం మంది కనీసం ఒక్కడోసు కరోనా టీకా తీసుకున్నారు. అయితే వృద్ధులకు టీకాలు సరిగా పంపిణీ చేయలేదని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు మరణించిన వ్యక్తి కూడా టీకా తీసుకున్నాడా? లేదా? అనే విషయంపై ఆరోగ్య శాఖ స్పష్టత ఇవ్వలేదు.

shooting at Nightclub: అమెరికాలోని నైట్‌క్లబ్‌లో కాల్పుల మోత.. ఐదుగురు మృతి, 18మందికి గాయాలు

కరోనా కట్టడికి ప్రపంచంలో ఏ దేశమూ అమలు చేయని విధంగా జీరో కోవిడ్ పాలసీని అమలు చేస్తోంది చైనా. కేసులు నమోదైన ‍ప్రాంతాల్లో లాక్‌డౌన్ సహా కఠిన ఆంక్షలు విధిస్తోంది. వ్యాపారం, ఆర్థికవ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడుతున్నప్పటికీ ఆంక్షల విషయంలో మాత్రం రాజీ పడటం లేదు. చైనాలో ఇప్పటివరకు 2,86,197 కరోనా కేసులు వెలుగుచూశాయి. వైరస్ బారినపడిన వారిలో 2,60,141 మంది కోలుకున్నారు. కొవిడ్‌ కఠిన ఆంక్షల కారణంగా ఝెంగ్‌జువాలో ఇటీవల ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోవడంతో చైనీయుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోన్న సంగతి తెలిసిందే. దీంతో ఆంక్షలు కొనసాగుతోన్న ప్రాంతాల్లో 3ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారిపై ఆంక్షలు సడలించినట్లు అక్కడి అధికారులు ప్రకటించారు. వారికి కొవిడ్‌-19 నెగెటివ్‌ సర్టిఫికేట్‌ అవసరం లేదని పేర్కొన్నారు.

Show comments