పటాన్ చెరు (మం) చిట్కుల్ లో విషాదం చోటుచేసుకుంది. ఫ్యాన్ కి టవల్ చుట్టుకుని ఆడుకుంటుండగా.. కరెంట్ రావడంతో టవల్ మెడకు చుట్టుకుని తొమ్మిదేళ్ల చిన్నారి మృతిచెందింది. ఇంట్లో కరెంట్ లేకపోవడంతో అక్కాతమ్ముడు ఇద్దరు ఫ్యాన్ కి టవల్ కట్టుకుని ఊయల ఊగుతున్నారు. ఫ్యాన్ స్విచ్ ఆన్ లో నే ఉంది. ఊయల ఊగుతున్న సమయంలో ఒక్కసారిగా కరెంట్ రావడంతో ఫ్యాన్ తిరగడంతో చిన్నారి సహస్ర మెడకు టవల్ బిగ్గర చుట్టుకుపోయింది.
దీంతో ఊపిరాడక చిన్నారి అక్కడికక్కడే మృతిచెందింది. సహస్ర 4వ తరగతి చదువుతోంది. అయితే ఘటనా సమయంలో ఇంట్లో తల్లిదండ్రులు లేకపోవడంతో ఈ దారుణం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. ఇక తమ చిన్నారి లేదన్న విషయం తెలిసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఈ సందర్భంగా పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఓ కంట కనిపెడుతూ ఉండాలని.. అజాగ్రత్తగా ఉండొద్దని పోలీసులు సూచించారు.