NTV Telugu Site icon

CM Revanth: జనగణనలో కులగణన చేయాలని సీఎం రేవంత్ ప్రతిపాదన.. సీడబ్ల్యుసీ తీర్మాణం

Cm Revanth Reddy

Cm Revanth Reddy

కర్నాటకలోని బెల్గాంలో జరుగుతున్న సీడబ్ల్యుసీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఆయనతో పాటు.. టీపీసీసీ చీఫ్‌ మహేష్ కుమార్‌గౌడ్‌, ఇతర నేతలు కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలో.. సీడబ్ల్యూసీ సమావేశంలో తెలంగాణ నుంచి మాట్లాడే అవకాశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్‌లకు దక్కింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో త్వరలో పార్లమెంట్ నియోజక వర్గాల పునర్విభజన జరిగే అవకాశాలు ఉన్నాయని, జనాభా ప్రాతిపదికన జరిగితే దక్షిణాది రాష్ట్రాలలో సీట్ల పెంపు తక్కువగా ఉండి నష్టపోయే పరిస్థితి ఉంటుందని.. అందువల్ల ఏఐసీసీ వ్యూహాత్మకంగా ఆలోచించాలని అన్నారు. నియోజక వర్గాల సంఖ్య పెంపు విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగకుండా అత్యంత జాగ్రత్తగా ముందడుగు వేయాలని పేర్కొన్నారు.

Read Also: Congress: రేపటి నుంచి కాంగ్రెస్ ‘‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’’ ప్రచారం..

చట్ట సభలలో మహిళ బిల్లును కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే ప్రవేశ పెట్టి.. ఒక కొలిక్కి తెచ్చిన నేపథ్యంలో ఆ బిల్లు పై మనం ఎక్కవగా ప్రచారం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. బీజేపీ మహిళ బిల్లుతో వారికి అనుకూలంగా రిజర్వేషన్లు చేసుకునే అవకాశాలు ఉంటాయని.. ఆ విషయంలో కాంగ్రెస్ అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని అభిప్రాయపడ్డారు. కులగణన తెలంగాణలో దేశంలోనే మార్గదర్శిగా ఉందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది చేయబోతున్న జన గణనలో దేశ వ్యాప్తంగా కులగణన కూడా చేపట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేసి పోరాటం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ విషయంలో సీడబ్ల్యుసీ ఒక తీర్మాణం చేసి కేంద్రానికి పంపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించగా.. రేవంత్ రెడ్డి ప్రతిపాదనను సీడబ్ల్యుసీ తీర్మాణం చేసి ఏకగ్రీవంగా ఆమోదించింది.

Read Also: Bandi Sanjay: ఏం సాధించిందని అభినందనలు చెప్తున్నావ్.. రాహుల్ గాంధీపై సెటైర్లు

టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. సరిగ్గా వంద ఏళ్ల క్రితం ఇదే బెల్గామ్‌లో మహాత్మా గాంధీని సీడబ్ల్యుసీ ఏఐసీసీ అధ్యక్షులుగా ఎన్నుకున్నదని, తర్వాత ఆయన ఏ ఒక్క పదవి చేపట్టకపోయినా.. ప్రపంచ వ్యాప్తంగా గాంధీని ఆచరిస్తారని అందుకు ఆయన చెప్పిన సిద్ధాంతాలు, విధానాలే కారణమని అన్నారు. రాహుల్ గాంధీ ఆలోచనలతో చేపట్టాలని నిర్ణయించిన కులగణనతో దేశంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయని.. ఇది దేశం అంత స్వాగతించాల్సిన అంశమని అన్నారు. కులాల పేరిట, మతాల పేరిట రాజకీయాలు చేస్తూ దేశాన్ని విభజించి పాలిస్తూ రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్న బీజేపీ కుటిల రాజకీయ ఎత్తుగడలకు కులగణన చెంపపెట్టు లాంటిదని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణనకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రారంభించిందని, తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని తెలిపారు.