Man Kills Parents: డబ్బుల కోసం కుటుంబాన్నే కడతేర్చాడు ఓ కసాయి కొడుకు. ఈ దారుణ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని మహాసముంద్ జిల్లాలో చోటుచేసుకుంది. డ్రగ్స్‌కు బానిసైన 24 ఏళ్ల యువకుడు తన తండ్రి డబ్బులు ఇవ్వలేదని.. తన తల్లిదండ్రులు, నానమ్మను చంపి వారి మృతదేహాలను కాల్చివేశాడు. ఈ ఘటన సింగ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పుట్కా గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడిని 24 ఏళ్ల ఉదిత్ భోయ్‌గా పోలీసులు గుర్తించారు. నిందితుడు డ్రగ్స్ బానిస అని, అతని తండ్రి డబ్బు ఇచ్చేందుకు నిరాకరించడంతో కుటుంబ సభ్యులను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.నిందితుడి తండ్రి ప్రభాత్ భోయ్ తన భార్య, తల్లి, కొడుకుతో కలిసి పుట్కా గ్రామంలో నివసిస్తున్నాడు. నిద్రకు ఉపక్రమించిన ఉదిత్ తల్లిదండ్రులు, నానమ్మలను హత్య చేశాడు. తన తండ్రి తలపై కర్రతో కొట్టి, ఆపై తల్లిపై దాడికి పాల్పడ్డాడు. ఈ గొడవతో మేల్కొన్న నానమ్మపై కూడా ఉదిత్ దాడి చేశాడు. అనంతరం వారి మృతదేహాలను ఇంట్లోని బాత్‌రూమ్‌లో ఉంచాడు. మరుసటి రోజు, ఉదిత్ ఇంటి పెరట్లో కలప, శానిటైజర్ ఉపయోగించి మృతదేహాలకు నిప్పంటించాడు.
ఉదిత్ మే 12న సింగ్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ రిపోర్టును దాఖలు చేశాడు. రాయ్‌పూర్‌లో చదువుతున్న ప్రభాత్ భోయ్ మరో కుమారుడు అమిత్, తన తల్లిదండ్రులు, నానమ్మ అదృశ్యమైన విషయం తెలుసుకున్నప్పుడు అనుమానం వచ్చింది. అతను పుట్కాలోని వారి నివాసానికి వచ్చినప్పుడు, అతని పెరట్లో రక్తపు మరకలు, మానవ ఎముకలతో పాటు మంటలు కనిపించాయి. దీంతో ఆందోళనకు గురైన అమిత్ వెంటనే సింగ్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఘటనపై పోలీసులకు సమాచారం అందించాడు.
Read Also: Dog attacks: కాజీపేటలో కుక్కల బెడద.. మూడు రోజుల్లో ఎనిమిది మందిపై దాడి
ఇంతలో ఉదిత్ తన తండ్రి మొబైల్ ఫోన్ నుండి అతని బంధువులకు సందేశాలు పంపాడు. ప్రభాత్ భోయ్ క్షేమంగా ఉన్నాడని సూచిస్తూ, వారి అదృశ్యానికి అమిత్ కారణమని ఆరోపించాడు. అయితే, పోలీసులు మొబైల్ ఫోన్ లొకేషన్‌ను ట్రేస్ చేశారు. ఇది నేరం జరిగిన ప్రాంతానికి సమీపంలోకి తీసుకెళ్లింది. పోలీసులు ఆ ఇంట్లో సోదాలు నిర్వహించగా, పెరట్లో రక్తపు మరకలు, కాలిపోయిన మృతదేహాల ఆనవాళ్లు, బూడిదలో మానవ అవశేషాలు కనిపించాయి. పోలీసులు ఉదిత్ భోయ్‌ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. మొదట్లో అస్పష్టమైన సమాధానాలతో పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినా తర్వాత నేరం అంగీకరించాడు. దీంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.