పాముకాటుతో 22 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. అనంతరం.. అతని చితిపైనే కాటేసిన పామును సజీవ దహనం చేశారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో చోటు చేసుకుంది. ఆదివారం రోజు ఈ ఘటన జరిగింది. అయితే స్థానికులు.. పాము మరొకరికి హాని చేస్తుందనే భయంతో దానిని చితిపై కాల్చారు. దిగేశ్వర్ రథియా అనే వ్యక్తిని ఓ విషపూరిత పాము కాటు వేసింది. బైగామర్ గ్రామంలో అతను ఇంట్లో రాత్రి పడుకునే సమయంలో పాము కాటుకు గురయ్యాడు. అయితే అతన్ని కోర్బా ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మరణించాడు.
Read Also: Kashi: తిరుపతి లడ్డు తిన్నందుకు.. సనాతన పద్ధతిలో శుద్ధి.. ప్రక్రియ ఇదే!
అంతలోపు కాటేసిన పామును దొరకపట్టి బంధించారు. అంత్యక్రియల ఊరేగింపు సమయంలో పామును తాడుతో కట్టేసి కర్రకు వేలాడదీశారు. దిగేశ్వర్ ఇంటి నుంచి అతన్ని దహనం చేసిన ప్రదేశం వరకు పామును కూడా లాక్కెళ్లారు. కాగా.. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అనంతరం రథియా అంత్యక్రియల చితిపై పామును సజీవ దహనం చేశారు.
Read Also: Nebula-1 Rocket: చైనా ఆశలు అడియాశలు..! ల్యాండింగ్ సమయంలో రాకెట్ పేలి భారీ నష్టం
విషపూరిత పాము వేరొకరికి ప్రమాదం చేస్తుందని భయాందోళనకు గురై చితిపై కాల్చినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటనపై కోర్బా సబ్ డివిజనల్ అధికారి ఆశిష్ ఖేల్వార్ స్పందిస్తూ.. పామును చంపిన గ్రామస్తులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని చెప్పారు. పర్యావరణ వ్యవస్థకు సరీసృపాలు ముఖ్యమైనవి కాబట్టి.. పాములు, పాముకాటు నిర్వహణ గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తామని ఆయన తెలిపారు.