Site icon NTV Telugu

Chhattisgarh Drug Bust: సినిమా ఫక్కీలో నల్లమందు సాగు.. పొలానికి సెక్యూరిటీగా బౌన్సర్లు!

Drug Racket

Drug Racket

Chhattisgarh Drug Bust: సాధారణంగా సెలబ్రిటీల దగ్గరో, పబ్‌ల దగ్గరో బౌన్సర్లను చూస్తాం. కానీ ఒక రైతు తన పొలానికి బౌన్సర్లను కాపలా పెట్టాడు. లోపలికి ఎవరూ రాకుండా జెడ్ ప్లస్ సెక్యూరిటీని ఏర్పాటు చేశాడు. అసలు ఆ పొలంలో అంతటి విలువైన పంట ఏం పండుతోంది? పోలీసులు అక్కడికి వెళ్లినప్పుడు కనిపించిన దృశ్యం చూసి ఎందుకు షాక్ అయ్యారో ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలో పోలీసులు చేపట్టిన భారీ ఆపరేషన్ ఒక పెద్ద డ్రగ్ రాకెట్‌ను బట్టబయలు చేసింది. అక్రమ నల్లమందు సాగును కాపాడటానికి బౌన్సర్లను నియమించుకున్న ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

READ ALSO: T20 World Cup 2026: టీమిండియా ఆటతీరుకు ఫిదా.. మెన్ ఇన్ బ్లూకు ఫ్యాన్‌గా మారిపోయిన పాక్‌ మాజీ కెప్టెన్..

పలు నివేదికల ప్రకారం.. నిందితులు సుమారు 5 ఎకరాల వ్యవసాయ భూమిలో అత్యంత రహస్యంగా నల్లమందు సాగు చేస్తున్నారు. పోలీసులతో పాటు అపరిచితులు ఎవరూ లోపలికి రాకుండా ఉండేందుకు పొలం చుట్టూ భారీకాయులైన బౌన్సర్లను మోహరించారు. విషయం తెలుసుకొని అధికారులు పొలానికి వెళ్లి నల్లమందును స్వాధీనం చేసుకున్నారు. అధికారులు స్వాధీనం చేసుకున్న ఈ నల్లమందు విలువ దాదాపు రూ.8 కోట్లు ఉంటుందని అంచనా. నిందితుడికి చెందిన 300 ఎకరాల భారీ పొలంలో మధ్యలో మొక్కజొన్న, అరటి తోటలు సాగు చేస్తూ, ఎవరికీ అనుమానం రాకుండా తోట మధ్యలో ఈ అక్రమ సాగును సాగించారు. ఈ అక్రమ సాగు వెనుక స్థానిక బీజేపీ నాయకుడు వినయ్ తామ్రాకర్ ప్రమేయం ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని అధికారులు తెలిపారు. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేయగా, పార్టీ అధిష్టానం వెంటనే తామ్రాకర్‌ను బీజేపీ నుంచి బహిష్కరించింది.

దుర్గ్ పోలీసులు, క్రైమ్ బ్రాంచ్ సంయుక్తంగా ఈ కేసును విచారిస్తున్నాయి. ఈ సందర్భంగా పలువురు అధికారులు మాట్లాడుతూ.. స్వాధీనం చేసుకున్న నల్లమందు మొక్కలను నాణ్యత పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపినట్లు తెలిపారు. ఇంత పెద్ద ఎత్తున సాగు చేయడానికి పెట్టుబడి ఎక్కడి నుంచి వచ్చింది? అన్న కోణంలో నిందితుడి బ్యాంక్ ఖాతాలను ఆరా తీస్తున్నట్లు సమాచారం. అక్కడ పండుతున్నది అక్రమ పంట అని తెలిసి కాపలా ఉన్నారా? లేక కేవలం డ్యూటీ మాత్రమే చేస్తున్నారా? అనే కోణంలో సెక్యూరిటీ సిబ్బందిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం నిందితులపై NDPS చట్టం కింద కఠిన కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

READ ALSO: Karuppu: స్టార్ హీరోపై కేసు వేయనున్న డైరెక్టర్? కోలీవుడ్‌లో కలకలం రేపుతున్న ‘కరుప్పు’ వివాదం!

Exit mobile version