మద్యం కుంభకోణం కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి విజయవాడ సబ్ జైలు వద్ద మరోసారి హంగామా సృష్టించారు. ఇప్పటికే రెండు రోజులు జైలు వద్ద చెవిరెడ్డి హంగామా చేయగా.. నేడు కూడా రచ్చ చేశారు. జైలు నుంచి బయటకు తీసుకువచ్చే సమయంలో సిట్ దర్యాప్తుపై చెవిరెడ్డి వ్యాఖ్యలు చేశారు. తనపై తప్పుడు కేసులు పెట్టారని, అవి నిలబడవన్నారు. తప్పుడు కేసులు పెట్టిన వారికి ఏదొకరోజు తప్పకుండా శిక్ష పడుతుందంటూ చెవిరెడ్డి పోలీసు వ్యాన్ ఎక్కారు.
రెండోరోజు జైలు నుంచి బయటకు వచ్చే సమయంలో సిట్ అధికారులు తప్పుల మీద తప్పులు చేస్తున్నారని చెవిరెడ్డి భాస్కరరెడ్డి అరుస్తూ వెళ్లారు. తప్పులు చేసే అధికారులు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందంటూ హెచ్చరించారు. చెవిరెడ్డి మొదటి రోజు కూడా వ్యాఖ్యలు చేశారు. తప్పుడు కేసులు పెట్టి తనను అన్యాయంగా జైలుకి పంపారని, దేవుడు అన్నీ చూస్తున్నాడన్నారు. అన్యాయంగా తప్పుడు కేసులు పెడుతున్న వారిని ఆ దేవుడు శిక్షిస్తాడని, కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుందని చెవిరెడ్డి అన్నారు. జైలు నుంచి బయటకు తీసుకువచ్చే సమయంలో మూడు రోజులు చెవిరెడ్డి హంగామా చేశారు.
Also Read: Fire Accident: గోవిందరాజస్వామి ఆలయం వద్ద భారీ అగ్ని ప్రమాదం.. తప్పిన పెను ప్రమాదం!
ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఏ38గా చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఉన్నారు. చెవిరెడ్డిని మూడు రోజుల పాటు సిట్ కస్టడీకి అప్పగిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విచారించాలని ఆదేశాల్లో న్యాయమూర్తి పేర్కొన్నారు. చెవిరెడ్డిని ఈరోజు మూడో రోజు కస్టడీలోకి సిట్ అధికారులు తీసుకున్నారు. రెండు రోజుల విచారణలో చెవిరెడ్డి సహకరించలేదని సిట్ చెబుతోంది. నేటితో కస్టడీ ముగియనున్న నేపద్యంలో సమాచారం రాబట్టాలని సిట్ అధికారులు చుస్తున్నారు.