NTV Telugu Site icon

Ranjith Reddy: కొండా తిరిగింది ఊర్లు కాదు, టూర్లు.. రంజిత్​ రెడ్డి ఫైర్​

Ranjith Reddy

Ranjith Reddy

Ranjith Reddy: బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్​ రెడ్డి గత ఐదేండ్లు తిరిగింది చేవెళ్ళలోని ఊర్లు కాదని.. టూర్లు అని కాంగ్రెస్​ అభ్యర్థి డాక్టర్​ జి. రంజిత్​ రెడ్డి ఎద్దేవా చేశారు. కరోనా లాంటి విపత్తు యావత్​ ప్రపంచాన్ని, చేవెళ్ళ ప్రాంతాన్ని అతలాకుతలం చేస్తే.. ఆయన ఇంట్లో పడుకొని ఎన్నికలప్పుడు మాత్రం బయటకు వచ్చి హడావుడి చేస్తున్నారని ఆగ్రహించారు. కొత్తగా సోషల్​ మీడియాలో ఛాలెంజిల పేరుతో చవట ముచ్చట్లు చెబుతున్నారని విమర్శించారు. ఎన్నికలంటే ఛాలెంజిలు కాదు ప్రజాసేవ అని తెలుసుకోవాలని కొండాకి హితవు పలికారు. ఆదివారం రంజిత్​ రెడ్డి శేరిలింగంపల్లి, చేవెళ్ల ప్రాంతాల్లో జరిగిన వికలాంగుల సమావేశం, కార్నర్​ మీటింగ్​, గెటేడ్​ కమ్యూనిటీల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంజిత్​ రెడ్డి మాట్లాడారు. కొండా విశ్వేశ్వర్​ రెడ్డి కొవిడ్ టైంలో ఆయన సొంత ఇంటి గడప దాటారా? అని ప్రశ్నించారు. దర్వాజలేసుకుని శానిటైజర్ ఎట్ల రుద్దుకోవాల్నో వీడియోలు చేసుకుంటూ కూర్చున్నారు.. కానీ తాను ప్రతి గడపకి నిత్యవసర వస్తువులు, మందులు, పిల్లలు చదువుకోవడానికి టీవీలు ఇచ్చుకుంటూ నియోజకవర్గంలోనే తిరిగాను అని చెప్పారు. ఆయన మామ, ఆయన భార్య వాళ్ల అపోలో హాస్పిటల్‌కు కొవిడ్ టైంలో బిల్లులకు లిమిట్లు పెట్టొద్దు అని పర్మిషన్ కోసం తిరిగారని గుర్తు చేశారు. కొవిడ్ లాంటి భయంకరమైన కష్టం వచ్చినప్పుడు.. పబ్లిక్‌ను ఎట్ల ఆదుకోవాల్నా అని తాను ఆలోచించానని అని.. వాళ్లేమో జనాల ప్రాణాల మీద పైసలు వసూలు చేసుకున్నారని విమర్శించారు. హైదరాబాదులో ఉన్న లక్షల మంది వీకెండ్ రోజు చేవెళ్ళ చుట్టుపక్కలకు పిక్నిక్ కోసం వచ్చి పోతుంటారని.. ఆయన ఐదేళ్ల కోసారి వచ్చి పోతుంటారని అంతే తేడా అని ఎద్దేవా చేశారు. పబ్లిక్‌కు ఆయనే ఒక ఛాలెంజ్… ఐదేళ్ల కోసారి వస్తారని.. ఒక్కోసారి ఒక్కో కండువా వేస్కుని వస్తారని విమర్శించారు. ఆయనకు అసెంబ్లీ నియోజకవర్గాల పేర్లు కూడా తెలియవని విమర్శించారు.

Read Also: CM Revanth Reddy: మంటల్లో ఇరుక్కున్న కార్మికులను కాపాడిన బాలుడుని అభినంధించిన సీఎం..

బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్​ పోతయ్​!
బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగాన్ని మార్చేసే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. దేశంలోని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీలకు రిజర్వేషన్లు రద్దు అవుతాయని చేవెళ్ళ కాంగ్రెస్​ అభ్యర్థి రంజిత్​ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అటువంటి పార్టీకి చేవెళ్ళ ప్రజలు తమ ఓటు హక్కుతో బీజేపీకి గుణపాఠం చెప్పాలన్నారు. భారతదేశం ఏమైపోతుందోనన్న ఆందోళన అన్ని వర్గాల్లో వ్యక్తమవుతోందన్నారు. రాబోయే పది రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయని, చేవెళ్ళ ప్రజలు విజ్ఞతతో, వివేకంతో, ఆలోచించి ఓటు వేయాల్సిన అవసరం ఉందని అన్నారు. చేవెళ్ళ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఓటు వేయాలని సూచించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు అనుకూల గాలి వీస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తల పట్టుకొమ్మలు రాబోయే పార్లమెంటు ఎన్నికలలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేసి కాంగ్రెస్ పార్టీ గెలుపులో క్రియాశీల పాత్ర వహించాలని కోరారు. బీజెపి చేస్తున్నటువంటి మోసపూరితమైన హామీలను ప్రజలకు వివరించాలని సూచనలు చేశారు. పార్లమెంటు ఎన్నికల అనంతరం రైతు రుణమాఫీతో పాటు అన్ని గ్యారెంటీలను పకడ్బందీగా అమలు చేస్తామని తెలిపారు.