NTV Telugu Site icon

Ranjith Reddy: చేవెళ్ల ప్రజలకు చేయూతనిచ్చిన జ‌నజాత‌ర‌

Congress

Congress

Ranjith Reddy:  చేవెళ్ళ ప్రజలకు కాంగ్రెస్​ పార్టీ నిర్వహించిన జనజాతర చేయూతనిచ్చినట్టు కనిపిస్తోంది. శనివారం రాష్ట్ర కాంగ్రెస్​ నిర్వహించిన తుక్కుగూడ‌ బహిరంగ సభ కిక్కిరిసిపోయింది. కాంగ్రెస్​ శ్రేణులంతా కదం తొక్కారు. పార్టీ కార్యకర్తలు ల‌క్షలాదిగా త‌ర‌లిరాగా… చేవెళ్ళ ఎంపీ డాక్టర్​ జి. రంజిత్​ రెడ్డి కార్యక్రమ నిర్వహణలో అంతా తానై వ్యవహరించారు. న్యాయ ప‌త్రం పేరిట జాతీయ స్థాయి మ్యానిఫెస్టో విడుద‌ల చేయడంలో క్యాడర్​లో మంచి జోష్​ వచ్చిందని పొలిటికల్​ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చేవెళ్ళ సీటు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు హస్తం పార్టీ అగ్రనేతలు. అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు అచ్చొచ్చిన తుక్కుగూడ నుంచే హ‌స్తం పార్టీ లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు జంగ్ సైర‌న్ మోగించింది. కొద్ది నెల‌ల క్రితం గెలిచి తీర‌తాం.. అధికారంలోకి వ‌స్తామంటూ ఆ స‌భ సాక్షిగా ప్రతినబూనిన ఆ పార్టీ అగ్రనేత‌లు, మ‌రోసారి అదే ర‌కంగా ఇండియా కూట‌మి అధికారంలోకి రావ‌టం ఖాయ‌మంటూ నొక్కి చెప్పారు. ప్రధాని మోడీ, ఆయ‌న పార్టీ బీజేపీ వ‌ద్ద సీబీఐ, ఈడీలాంటి సంస్థలుంటే, త‌మ వ‌ద్ద ప్రజ‌ల ప‌ట్ల ప్రేమ‌, స్వచ్ఛత ఉన్నాయ‌నీ, అవే త‌మ‌కూ త‌మ పార్టీకి కొండంత అండంటూ వారు కార్యక‌ర్తల్లో ఆత్మస్థైర్యం నింపారు. స‌మ‌భావ‌న‌, స‌మ‌న్యాయ‌మే త‌మ అస‌లు సిస‌లు సిద్ధాంతాలనీ, ఆ విజ‌య ర‌హ‌స్యాల ఆధారంగానే ఈసారి ఢిల్లీ పీఠంపై కాంగ్రెస్ జెండాను ఎగ‌రేయ‌బోతున్నామ‌ని వారు జోస్యం చెప్పారు.

లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు స‌మ‌ర‌శంఖం పూరిస్తూ అఖిల భార‌త కాంగ్రెస్ క‌మిటీ (ఏఐసీసీ) నేతృత్వంలో శ‌నివారం రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ‌లో ఆ పార్టీ నిర్వహించిన జ‌న జాత‌ర బ‌హిరంగ స‌భ‌కు జ‌నం ల‌క్షలాదిగా త‌ర‌లొచ్చారు. ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ వ‌రకూ, భద్రాచ‌లం నుంచి సంగారెడ్డి వ‌ర‌కూ హ‌స్తం పార్టీ కార్యక‌ర్తలు, నాయ‌కులు పెద్ద ఎత్తున వాహ‌నాల్లో జ‌న జాత‌ర‌కు త‌ర‌లారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆ పార్టీ రాష్ట్ర వ్యవ‌హారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ, ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాక‌ర్‌, సీత‌క్క, కొండా సురేఖ‌, చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి త‌దిత‌రులు ఈ స‌భ‌లో పాల్గొని ప్రసంగించారు.

Read Also: Congress: జూన్ 4 తర్వాత ప్రధాని మోడీకి లాంగ్ లీవ్.. జైరాం రమేష్ కామెంట్స్..

జ‌న జాత‌ర‌లో ముఖ్య వ‌క్తగా ప్రసంగించిన రాహుల్ గాంధీ… తుక్కుగూడ నుంచే న్యాయ‌ప‌త్రం పేరిట కాంగ్రెస్ జాతీయ స్థాయి మేనిఫెస్టోను విడుద‌ల చేయ‌టం ద్వారా యావ‌త్ దేశం దృష్టిని ఆక‌ర్షించారు. యువ న్యాయం, భాగ‌స్వామ్య న్యాయం, మ‌హిళా న్యాయం, రైతు న్యాయం, కార్మిక న్యాయం… అనే ఐదు అంశాల‌ను ఇందులో ప్రస్తావించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఇచ్చిన‌ట్టుగానే జాతీయ స్థాయిలోనూ ప్రక‌టించిన వాగ్దానాల‌ను క‌చ్చితంగా అమ‌లు చేసి తీర‌తామంటూ ఆయ‌న భ‌రోసానిచ్చారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపైనా, ప్రధాని మోడీపైనా ఈ సంద‌ర్భంగా ఆయ‌న వ్యంగ్యాస్త్రాల‌ను సంధించారు. బీజేపీని ఆయ‌న ఒక వాషింగ్ మిష‌న్ గా అభివ‌ర్ణిస్తూ ఆయ‌న ఎద్దేవా చేశారు. దేశంలోని ప్రతిప‌క్ష నేతలు, విప‌క్ష పార్టీల‌కు చెందిన ముఖ్యమంత్రులంద‌ర్నీ కాషాయ పార్టీ అవినీతి ప‌రులంటూ ముద్ర వేస్తోందీ, కానీ వారిలో ఎవ‌రైనా ఆ పార్టీలో చేరితే మాత్రం మ‌ర‌క‌లన్నీ పోయి ప‌విత్రుల‌వుతున్నారంటూ సైటైర్లు విసిరారు. సీఎం రేవంత్ సైతం… బీజేపీపై విరుచుకుప‌డ్డారు. న‌మో అంటే న‌మ్మించి మోసం చేయ‌ట‌మేన‌ని ఘాటుగా విమ‌ర్శించారు. ప‌దేండ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న ఆపార్టీ, తెలంగాణ‌కు ఒర‌గ‌బెట్టింది గుండు సున్నా అంటూ ఆవేద‌న వ్యక్తం చేశారు. రాష్ట్ర విజ‌భ‌న చ‌ట్టంలోని హామీలేమ‌య్యాయంటూ ఆయ‌న ప్రశ్నించారు. తెలంగాణ‌కు చెందిన ఏడు మండ‌లాల‌ను ఏపీలో క‌లిపి అన్యాయం చేశారంటూ వాపోయారు. అందువ‌ల్ల ఎంపీ ఎన్నిక‌ల్లో ఏ ముఖం పెట్టుకుని బీజేపీ వాళ్లు ఓట్లడుగుతారంటూ సీఎం నిల‌దీశారు. జూన్ నాలుగున హ‌స్తినలో ఇండియా కూట‌మే అధికారంలోకి రాబోతోంద‌ని ఆయ‌న జోస్యం చెప్పి, కాంగ్రెస్ శ్రేణులను ఉత్సాహ ప‌రిచారు. వారిలో జోష్ నింపారు.

మొత్తం మీద అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు రాష్ట్ర కాంగ్రెస్‌కు జ‌వ‌స‌త్వాలిచ్చిన తుక్కుగూడ‌… ఇప్పుడు జాతీయ స్థాయిలో ఆ పార్టీకి మ‌రింత బ‌లాన్ని ఇచ్చింది. ఇప్పటికే తెలంగాణ‌లో అధికారం చేప‌ట్టి, మాంచి ఊపులో ఉన్న ఆ పార్టీ, ఇప్పుడు ఈ స‌భ ద్వారా అత్యధిక లోక్‌స‌భ సీట్లను గెలుచుకోగ‌ల‌న‌నే విశ్వాసాన్ని నింపుకుంది. ఎన్నిక‌ల షెడ్యూల్‌, విప‌రీత‌మైన బిజీ వ‌ల్ల ఏఐసీసీ అధ్యక్షుడు మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే, అగ్రనేత ప్రియాంకా గాంధీ స‌భ‌కు గైర్హాజ‌రైనా ఆ లోటును భర్తీ చేస్తూ రాహుల్‌, రేవంత్ ప్రసంగాలు కొన‌సాగాయి. ఏ ర‌కంగా చూసినా ఈ స‌భ రాష్ట్ర కాంగ్రెస్‌కు మ‌రింత బూస్టును ఇచ్చింద‌ని చెప్పక త‌ప్పదు.