దేవభూమిగా పిలవబడే ఉత్తరాఖండ్‌లోని అత్యంత పవిత్రమైన చార్‌ధామ్ క్షేత్రాల విషయంలో శ్రీ బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ (BKTC) ఒక చారిత్రాత్మక , సంచలన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఈ ఆలయాల పవిత్రతను, మతపరమైన విలువలను కాపాడటమే ధ్యేయంగా హిందూయేతరుల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించాలని కమిటీ యోచిస్తోంది. రానున్న అక్షయ తృతీయ నాటికి ప్రారంభం కానున్న 2026 చార్‌ధామ్ యాత్ర కంటే ముందే ఈ నిబంధనను అమల్లోకి తీసుకురావాలని కమిటీ గట్టి పట్టుదలతో ఉంది.
కేవలం రూ.3,500కే గోవా టూర్..! TGSRTC అదిరిపోయే ఆఫర్.. మిస్ కావద్దు.!
పవిత్రత పరిరక్షణే పరమావధి
శ్రీ బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ అధ్యక్షుడు హేమంత్ ద్వివేది వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ పురాతన ఆలయాల ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను , సనాతన ధర్మ సంప్రదాయాలను కాపాడటం తమ ప్రాథమిక బాధ్యత. గత కొంతకాలంగా క్షేత్రాల పరిసరాల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని, కొంతమంది పర్యాటకులు మద్యం , మాంసం సేవిస్తూ ఆలయాల పవిత్రతను భంగపరుస్తున్నారని స్థానిక పూజారులు, ఎమ్మెల్యేల నుండి కమిటీకి అనేక ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలోనే కేవలం బద్రీనాథ్, కేదార్‌నాథ్ మాత్రమే కాకుండా, కమిటీ పరిధిలో ఉన్న మొత్తం 45 ఆలయాల్లో అన్యమతస్థుల ప్రవేశంపై నిషేధం విధించే ప్రతిపాదనను సిద్ధం చేశారు. త్వరలోనే జరగనున్న బోర్డు సమావేశంలో ఈ తీర్మానానికి అధికారిక ముద్ర వేయనున్నారు.
రాజకీయ దుమారం , భిన్నాభిప్రాయాలు
ఆలయ కమిటీ తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం రాజకీయ చర్చకు దారితీసింది. కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్ష పార్టీలు ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇది ప్రజల మధ్య విభజన తెచ్చే ప్రయత్నమని, ప్రభుత్వం కీలక సమస్యల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికే ఇటువంటి భావోద్వేగపూరిత నిర్ణయాలను ప్రోత్సహిస్తోందని విమర్శిస్తున్నాయి. అయితే, ఆలయ పూజారులు , స్థానిక భక్తులు మాత్రం ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ఆలయ నియమ నిబంధనలు గౌరవించే వారికి మాత్రమే ప్రవేశం ఉండాలని వారు స్పష్టం చేస్తున్నారు.
2026 యాత్ర షెడ్యూల్ , కొత్త రూల్స్
ఈ ఏడాది చార్‌ధామ్ యాత్రకు సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ ఖరారైంది. ఏప్రిల్ 19వ తేదీన అక్షయ తృతీయ సందర్భంగా గంగోత్రి, యమునోత్రి ఆలయాల ద్వారాలు తెరుచుకోనున్నాయి. బద్రీనాథ్ ఆలయం ఏప్రిల్ 23న భక్తులకు దర్శనమివ్వనుండగా, కేదార్‌నాథ్ ఆలయ ప్రారంభ తేదీని మహాశివరాత్రి (ఫిబ్రవరి 15) రోజున ప్రకటించనున్నారు. యాత్ర ప్రారంభం నాటికి ఈ కొత్త నిబంధనను అమలు చేయడం ద్వారా భక్తులకు ప్రశాంతమైన , ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పించవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే, యాత్రికుల గుర్తింపు కార్డుల తనిఖీ మరింత కఠినతరం అయ్యే అవకాశం ఉంది.
