NTV Telugu Site icon

Chandrayaan-3: జాబిల్లి ఉపరితలంపై అడుగుపెట్టిన రోవర్‌.. వీడియో విడుదల చేసిన ఇస్రో

Chandrayaan 3

Chandrayaan 3

Chandrayaan-3: చంద్రునిపై పరిశోధనలు జరిపేందుకు ప్రయోగించిన చంద్రయాన్‌-3 సురక్షితంగా జాబిల్లిపై దిగడంతో అంతరిక్ష రంగంలో భారత్ సరికొత్త చరిత్రను లిఖించింది. ఈ నెల 23న సాయంత్రం 6.04 గంటలకు చంద్రయాన్‌-3 విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై కాలుమోపగా.. కొన్ని గంటల అనంతరం రోవర్ బయటకు వచ్చి తన అధ్యయనాన్ని ప్రారంభించింది. అయితే ల్యాండర్ నుంచి రోవర్ చంద్రుడి ఉపరితలంపైకి అడుగుపెట్టిన వీడియోను తాజాగా ఇస్రో విడుదల చేసింది.

ఇస్రో షేర్‌ చేసిన వీడియోలో.. ల్యాండర్‌ నుంచి రోవర్‌ జారుకుంటూ జాబిల్లి ఉపరితలం పైకి అడుగుపెట్టింది. జాబిల్లి ఉపరితలంపైకి చంద్రయాన్-3 రోవర్ సులభంగా దిగేందుకు రాంప్ సహాయపడిందని ఇస్రో వెల్లడించింది. ఆగస్టు 23న ల్యాండర్‌ ఇమేజర్‌ కెమెరా ఈ దృశ్యాలను చిత్రీకరించింది. ఇక 14 రోజుల పాటు రోవర్‌ చంద్రుడిపై పరిశోధనలు జరపనుంది. ఇక, జాబిల్లి ఉపరితలంపై దిగిన విక్రమ్‌ ల్యాండర్‌, ప్రజ్ఞాన్‌ రోవర్‌ జాబిల్లి గుట్టు విప్పేందుకు పరిశోధనలను ప్రారంభించాయి. అయితే వాటి జీవితకాలం ఒక లూనార్‌ డే ( భూమిపై 14 రోజులకు సమానం) మాత్రమేనని ఇప్పటికే ఇస్రో ప్రకటించింది.

 

Read Also: G20 Summit: జీ-20 సదస్సుకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ దూరం.. క్రెమ్లిన్‌ ప్రకటన

సోలార్‌ ప్యానెల్ రోవర్‌కు శక్తిని ఉత్పత్తి చేయడానికి వీలు కల్పించిందని ఇస్రో వివరించింది. చంద్రుడిపై దిగిన ల్యాండర్‌, దాని నుంచి వెలువడిన రోవర్ 14 రోజులపాటు నిర్విరామంగా పనిచేయనున్నాయి. ఈ మిషన్ లోని ల్యాండర్ గాని, రోవర్ గాని పనిచేయడానికి, అలాగే అవి సేకరించిన సమాచారాన్ని భూమికి పంపడానికి విద్యుత్ అవసరం. వాటికి కావాల్సిన విద్యుత్ సూర్యకాంతి ద్వారా వస్తుంది. అందుకే చంద్రునిపై సూర్యోదయం అయ్యే సమయానికి ల్యాండర్‌ను ఇస్రో విజయవంతంగా ల్యాండ్ చేసింది. ఈ క్రమంలో ఈ మిషన్ లో ప్రధాన భాగాలైన లాండర్, రోవర్‌కు అమర్చిన సోలార్ ప్యానల్ సౌర శక్తిని స్వీకరించి విద్యుత్ శక్తిగా మార్చుకుంటాయి. ఆ శక్తి ద్వారా ల్యాండర్, రోవర్ పనిచేస్తాయి. 14 రోజుల తర్వాత సౌరశక్తితో నడిచే రోవర్ కార్యకలాపాలు మందగించే అవకాశం ఉంది. ఈ సమయంలో ఇది ల్యాండర్ విక్రమ్‌తో తాకడం ద్వారా ఇస్రోకు డేటాను చేరవేస్తుంది. ఇస్రోకు రోవర్‌తో ప్రత్యక్ష సంబంధం లేదు.. కనుక రోవర్‌ నేరుగా భూమిపైకి సమాచారాన్ని పంపించలేదు.