NTV Telugu Site icon

Chandrayaan-3: చంద్రయాన్‌-3పై ఇస్రో కీలక ప్రకటన.. సర్వత్రా ఉత్కంఠ

Chandrayaan 3

Chandrayaan 3

Chandrayaan-3: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-3 ప్రయోగంపై కీలక ప్రకటన చేసింది. చంద్రయాన్‌-3లో కీలకఘట్టం పూర్తి అయినట్లు ప్రకటించింది. చంద్రయాన్‌-3 ల్యాండర్ మాడ్యూల్‌ చివరి డీబూస్టింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు శనివారం అర్ధరాత్రి దాటాక ఇస్రో ప్రకటించింది. ప్రస్తుతం విక్రమ్‌ ల్యాండర్ 25 కి.మీX 134కి.మీ కక్ష్యలో పరిభ్రమిస్తోంది. ఈ నేపథ్యంలో విక్రమ్ సాఫ్ట్‌ ల్యాండింగ్‌పై ఇస్రో దృష్టి పెట్టింది. ఆగస్టు 23వ తేదీన సాయంత్రం 6.04గంటలకు చంద్రుడిపై విక్రమ్‌ ల్యాండర్‌ ల్యాండింగ్ కానున్నట్లు ఇస్రో వెల్లడించింది. అన్నీ అనుకూలిస్తే ఇస్రో ఆగస్టు 23న చంద్రుడి దక్షిణధ్రువంపై ఘనంగా కాలుమోపనుంది.

Read Also: Luna 25: రష్యా మూన్ మిషన్ ఫెయిల్.. చంద్రునిపై కుప్పకూలిన లూనా 25

“రెండో, చివరి డీబూస్టింగ్‌ ఆపరేషన్‌తో విక్రమ్‌ ల్యాండర్‌ మాడ్యూల్‌ 25 కి.మీX 134కి.మీ కక్ష్యలోకి చేరింది. మాడ్యూల్‌ను అంతర్గతంగా తనిఖీ చేయాల్సి ఉంది. ఎంచుకున్న ల్యాండింగ్‌ సైట్‌లో సూర్యోదయం కోసం ఎదురుచూస్తున్నాం. చంద్రుడిపై అడుగుపెట్టే ప్రక్రియ ఆగస్టు 23న సాయంత్రం 5.45 నిమిషాలకు ప్రారంభమవుతుంది” అని ఇస్రో ట్విటర్ వేదికగా వెల్లడించింది. ఇదిలా ఉండగా రష్యా చేపట్టిన లూనా-25 మూన్‌ మిషన్‌ విఫలమైంది. చంద్రుడిపై కాలుపెట్టకుండానే లూనా-25 కుప్పకూలిన నేపథ్యంలో ప్రస్తుతం ప్రపంచం దృష్టి ఇప్పుడు చంద్రయాన్‌-3పై నెలకొంది.