YS Jagan: రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు ఆరోపణలు చేశారని మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా మండిపడ్డారు. దగ్గరుండి కావాలని అబద్ధాలు చెప్పించి అనుమాన బీజాలు నాటారన్నారు. ప్రసాదం తినేవారిలో అనుమానాలు కలిగిస్తున్నారని వ్యాఖ్యానించారు. రాజకీయ స్వార్థం కోసం స్వామివారి విశిష్టతను దెబ్బతీస్తున్నారన్నారు. యానిమల్ ఫ్యాట్‌తో ప్రసాదాన్ని తయారు చేసినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. ఇది ధర్మమేనా అంటూ ప్రశ్నించారు. రోజుకో అబద్ధాన్ని ప్రమోట్ చేస్తున్నారన్నారు. 2015-108 వరకు చంద్రబాబు హయాంలో నందిని డెయిరీ బ్రాండ్‌ను ఎందుకు వాడలేదని ప్రశ్నించారు. మా ప్రభుత్వ హయాంలో కూడా నందిని డెయిరీ సంస్థ అప్పుడప్పుడు టెండర్లలో పాల్గొందని తెలిపారు. 2015-19 మధ్య ఏ రేటు నెయ్యిని కొన్నారని ఆయన ప్రశ్నలు గుప్పించారు.
Read Also: YS Jagan: రాష్ట్రంలో ఎప్పుడూ చూడని రాక్షస రాజ్యం నడుస్తోంది..
అప్పటి నుంచి ఇప్పటివరకు అవే డెయిరీలు, అవే ధరలు, అదే నెయ్యి అని ఆయన తెలిపారు. ఉన్న రేటు రూ.320 అయినప్పుడు కొంటే తప్పేంటని పేర్కొన్నారు. మీ హయాంలో కూడా ఇదే రేటుకు నెయ్యి కొన్నారన్నారు. నెయ్యి రేట్లు పెంచి హెరిటేజ్‌కు లాభం చేకూర్చాలని చంద్రబాబు అనుకున్నారని జగన్ ఆరోపించారు. తప్పులను జనం నిలదీయడంతో చంద్రబాబు టాపిక్ డైవర్ట్ చేశారని విమర్శించారు. నా కులం, నా మతం ఏంటో ప్రజలకు తెలియదా అంటూ జగన్ అన్నారు. గతంలో తన తండ్రి స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారని.. నేను ఆయన కొడుకునే కదా అంటూ ఆయన వ్యాఖ్యానించారు. పాదయాత్ర ముగిశాక కూడా స్వామివారిని దర్శించుకున్నానని జగన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అప్పుడు ప్రభుత్వం నడుపుతుంది చంద్రబాబే కదా అంటూ వెల్లడించారు. తిరుమలకు వెళ్లకూడదని ఇప్పుడు నోటీసులు పంపుతున్నారని తెలిపారు.
ఒక సీఎంగా ఐదేళ్లు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన వ్యక్తిని తిరుమలకు వెళ్లకూడదని అంటారా అంటూ జగన్ ప్రశ్నించారు. మతం ఏంటని ప్రశ్నిస్తారా అంటూ మండిపడ్డారు. ఇంట్లో తాను బైబిల్ చదువుతానని.. బయటకు వెళ్తే హిందూ, ఇస్లాం, సిక్కు మతాలను గౌరవిస్తానన్నారు. తన మతం మానవత్వమని జగన్ పేర్కొన్నారు. డిక్లరేషన్‌లో రాసుకుంటే రాసుకోండన్నారు. సెక్యులర్ అనే పదానికి అర్థం తెలుసా అంటూ ఆయన ప్రశ్నించారు. గుడికి వెళ్లాలని అనుకుంటే ఏ మతం అని అడుగుతున్నారన్నారు. ఒక మాజీ సీఎంకే ఈ పరిస్థితి ఎదురైతే.. దళితుల పరిస్థితి ఏంటన్నారు. మతం పేరుతో రాజకీయాలు చేయడం దౌర్భాగ్యమన్నారు. హిందూయిజానికి మేమే ప్రతినిధులమని బీజేపీ చెప్పుకుంటుందన్నారు. కూటమిలోని వ్యక్తి తిరుమలను, లడ్డూపై తప్పుడు ప్రచారం చేస్తుంటే బీజేపీ ఎందుకు మందలించట్లేదని ప్రశ్నించారు. చంద్రబాబును మీరెందుకు వెనకేసుకొస్తున్నారని.. ఇదే హిందుత్వమని ప్రశ్నలు గుప్పించారు. చెడు చేసే వారిని మంచి హిందువుగా గుర్తించనన్నారు.