పల్నాడులో టీడీపీ అధినేత చంద్రబాబు నేడు పర్యటించనున్నారు. జిల్లాలోని పెదకూరపాడు, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు చంద్రబాబు. ఈ సందర్భంగా క్రోసూరు, సత్తేనపల్లి బహిరంగ సభల్లో చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు దాచేపల్లిలో పార్టీ నేతలతో సమావేశంకానున్నారు. పల్నాడు జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో అభ్యర్థులపై కసరత్తు చేయనున్నారు. పార్టీ బలోపేతం, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం లాంటి అంశాలపై పార్టీ నేతలతో చర్చించనున్నారు.
ఇదిలా ఉంటే.. నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం యాత్రలో భాగంగా ఉభయ గోదావరి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మార్చి 30న పెన్షన్ల విషయంలో ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని, కానీ పింఛన్ల విషయంలో ప్రభుత్వం ప్రజల ప్రాణాలు తీస్తోందని మండిపడ్డారు. పెన్షన్ల అంశంలో రాజకీయాలు చేస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని చంద్రబాబు అన్నారు. వాలంటీర్లు రాజీనామా చేయాలని వైసీపీ నేతలు ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. వాలంటీర్లపై అక్రమ కేసులు పెట్టి జీవితాలు నాశనం చేస్తున్నారని మండిపడ్డారు.