NTV Telugu Site icon

Chandrababu: టీడీపీ కేడర్‌తో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. పింఛన్లపై కీలక ప్రకటన

Chandrababu

Chandrababu

Chandrababu: పెన్షన్ల అంశంలో వైసీపీ దుష్ప్రచారం చేస్తోందంటూ ఇంటింటి ప్రచారానికి టీడీపీ శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే టీడీపీ నేతలు, బూత్ లెవల్ కార్యకర్తలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ మేరకు పార్టీ కేడరుకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. పెన్షన్ డబ్బులను కాంట్రాక్టర్లకు ఇచ్చేశారనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు సూచించారు. ప్రతి ఇంటికి వెళ్లి పెన్షన్ విషయంలో వైసీపీ ప్రభుత్వ కుట్రలు, వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలని చంద్రబాబు నేతలకు సూచనలు చేశారు. తన రాజకీయ లబ్ది కోసం బాబాయినే చంపేసిన జగన్.. ఓట్ల కోసం ఇలాంటి అనేక కుట్రలు చేస్తాడని ఆరోపించారు. మనం వచ్చాక రూ. 4 వేల పెన్షన్ ఇంటింటికీ ఇస్తామని.. రెండు మూడు నెలలు తీసుకోకపోయినా అన్నీ కలిపి ఇస్తామని.. అన్ని విషయాలు లబ్దిదారులకు వివరించాలన్నారు. ప్రభుత్వం గత 15 రోజుల్లో ఎవరెవరికి ఎంతెంత బిల్లులు ఇచ్చిందో ప్రకటన చెయ్యాలన్నారు. మే 13 తరువాత ఇంటికి పోయే ముందు ఖజానాలో ఉన్న డబ్బంతా సొంత కాంట్రాక్టర్లకు దోచిపెట్టిందని.. గత 15 రోజుల్లో రూ. 13 వేల కోట్లు బిల్లుల కోసం చెల్లింపులు జరిపారని.. పేదలకిచ్చే డబ్బులు విషయంలో జగన్ నాటకాలు ఆడుతున్నాడని చంద్రబాబు విమర్శించారు.

Read Also: Prasanna Kumar Reddy: సీఎంగా జగన్‌ మళ్లీ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు..

ఇంటింటికీ పెన్షన్ ఇచ్చేలా ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయాలని కేడర్‌కు సూచించారు. ప్రజాగళం సభల స్పందన మిత్ర పక్షాల గెలుపునకు సూచకమన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలి అనే బలమైన భావన, కసి ప్రజల్లో కనిపిస్తుందన్నారు. జగనుకు వచ్చే ఎన్నికల్లో తన ఓటమి అర్థం అయ్యింది.. అందుకే ఫేక్ ప్రచారాలను పెంచాడన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. జగన్ కుట్ర రాజకీయాల స్పీడు పెంచాడని తీవ్రంగా విమర్శించారు. పెన్షన్లపై ప్రభుత్వ అబద్దాలు, తప్పుడు ప్రచారాలు జగన్ నీచ రాజకీయాలకు నిదర్శనమన్నారు. 1వ తేదీ ఇంటి వద్దనే పెన్షన్ అందించే విషయంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. వృద్దులు, వికలాంగులకు పెన్షన్ ఇంటి వద్దనే ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. వాలంటీర్లను ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలకు వాడుతున్నందునే సీఈసీ వారిని విధులకు దూరం పెట్టిందన్నారు. పెన్షన్లు పంపిణీ చేయొద్దని తెలుగు దేశం ఎవరినీ కోరలేదు.. కేంద్ర ఎన్నికల సంఘం కూడా చెప్పలేదన్నారు.

Read Also: Janga Krishna Murthy Quits YSRCP: వైసీపీకి ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి గుడ్‌బై.. ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా

1.35 లక్షల మంది సచివాలయం సిబ్బంది ఉన్నారు.. వారి ద్వారా ఒక్క రోజులో ఇంటింటికీ వెళ్లి పెన్షన్ ఇవ్వొచ్చన్నారు. ప్రభుత్వ పథకాలకు ఇవ్వాల్సిన డబ్బులు.. సొంత కాంట్రాక్టర్లకు ఇచ్చారని విమర్శలు గుప్పించారు. ఖజానా ఖాళీ చేసి పెన్షన్ ఇవ్వలేకపోయిన ప్రభుత్వం.. ఆ నెపాన్ని మనపై, ఎన్నికల సంఘంపై నెడుతోందన్నారు. వాలంటీర్ల విషయంలో మనం స్పష్టంగా ఉన్నామని.. వైసీపీ కోసం వాలంటీర్లు పని చేయొద్దని సూచించారు. వాలంటీర్ల భవిష్యత్ తమదే అని వ్యాఖ్యానించారు. వాలంటీర్లు ఎన్నికల వేళ తప్పులు చేస్తే వారిపైనా కేసులు పడే అవకాశం ఉంది.. వాళ్లూ అప్రమత్తంగా ఉండాలన్నారు. జగన్ రాజకీయ క్రీడలో వాలంటీర్ల జీవితాలను నాశనం చేయాలని చూస్తున్నాడని ఆరోపించారు. తన రాజకీయ లబ్ది కోసం నడి వేసవిలో వృద్దులను, వికలాంగులను కూడా జగన్ ఇంటింటికీ పెన్షన్ ఇవ్వకుండా వేధిస్తున్నాడని చంద్రబాబు అన్నారు. గ్రామ కార్యదర్శులు, సచివాలయ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులతో ఎందుకు ఇంటింటికీ పెన్షన్ ఇవ్వలేకపోతున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు.

Show comments