Chandrababu: మేడే సందర్భంగా ఇక్కడ ఎటుచూసినా శ్రామికులే గుర్తుకు వస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. మరో పది రోజులు ఓపిక పడితే అధికారం మనదేనంటూ చీరాల ప్రజాగళం బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. చీరాల చరిత్ర కలిగిన ప్రాంతమని.. చీరాల – పేరాల ఉద్యమం అందరికీ తెలుసన్నారు. అప్పట్లో చీరాలను బ్రిటిష్ వాళ్ళు మున్సిపాలిటీగా చేసి పన్నులు బాదేశారని ఆయన చెప్పారు. ఇవన్నీ పుస్తకాల్లో చదువుకున్నామని.. పన్నులు వేయటంతో దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నేతృత్వంలో ప్రజలు పోరాటాలు చేశారన్నారు. అందరూ పన్నులు కట్టలేమని ఊరు ఖాళీ చేసి రాంనగర్ అని అక్కడకు వెళ్లి కొత్త ఊరు కట్టారన్నారు. సంపద పెంచి సంక్షేమానికి వాడాలన్నారు. నేను చేసిన అభివృద్ధితో వచ్చిన ఆదాయంతో అప్పులు తెచ్చాడని ఆరోపణలు చేశారు. పది రూపాయలు ఇచ్చి వంద దోచేసుకుంటే మీ జీవితాల్లో మార్పులు వస్తాయా అంటూ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కూటమి నుంచి అదిరిపోయే మేనిఫెస్టో ఇచ్చామని.. అభివృద్ధి, సంక్షేమం ఇచ్చే కూటమి ఎన్డీఏ కూటమి అని ఆయన పేర్కొన్నారు. ప్రధాని మోడీ ఒక విజన్ ఉన్న నాయకుడన్నారు.
Read Also: CM YS Jagan: సూపర్ సిక్స్, కేజీ బంగారం అంటున్నారు.. ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు..
అప్పట్లో నేను అభివృద్ధి చేసిన హైదరాబాద్ నగరం తెలంగాణకు వెళ్ళిపోయింది.. ఎవరు అభివృద్ధి చేసినా తర్వాత వచ్చిన వాళ్ళు కొనసాగిస్తే అభివృద్ధి చెందుతుందన్నారు గతం సీఎంగా నేను చేసిన తర్వాత వచ్చిన వైఎస్ ఏదీ కూల్చేయలేదు.. జగన్ మాత్రం అమరావతిని కూల్చేశారన్నారు. అమరావతి పూర్తయితే చీరాల నుంచి గంటన్నరలో రాజధానికి వెళ్ళవచ్చన్నారు. ఆదాయాన్ని పెంచే ఒక సెంటర్ లాగా ఉండేదన్నారు. ఇక్కడ పనులు లేకపోతే హైదరాబాద్, చెన్నై వంటి నగరాలకు వలస వెళ్లే పరిస్థితి ఉందన్నారు. మీ రాజధాని ఏది అంటే చెప్పుకోలేని దౌర్భాగ్యం ఏర్పడిందన్నారు. రైతులకు సకాలంలో నీళ్ళు ఇచ్చామని.. పట్టిసీమను ప్రారంభించాననే ద్వేషంతో ఇప్పుడు దాన్ని వదిలేశారని ఆరోపించారు. ఇప్పుడు ఆయన చేసిన చెడ్డ పనులు సరిచేస్తామని.. ప్రజలకు ఉపయోగపడే పనులు కొనసాగిస్తాం.. అది తన బాధ్యత అని చంద్రబాబు పేర్కొన్నారు. అందరూ మే 13వ తేదీ గుర్తుంచుకోవాలని.. ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నామన్నారు. పిల్లల భవిష్యత్తు కోసం ఓటు వేయాలన్నారు. అగ్ర వర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించామన్నారు. ఆడబిడ్డల కోసం డ్వాక్రా సంఘాలు పెట్టింది టీడీపీనేనని.. పసుపుకుంకుమ క్రింద పదివేల కోట్లు ఇచ్చామన్నారు.
Read Also: Vellampalli Srinivas: ఈరోజు నీ గ్లాస్ నీ దగ్గర లేదు.. జనసేనానిపై విమర్శలు
ఈ సందర్భంగా కూటమి మేనిఫెస్టోలోని అంశాలను చంద్రబాబు పేర్కొన్నారు. పద్దెనిమిది యేళ్ళు నిండిన ప్రతీ ఆడబిడ్డకు నెలకు 1500 ఇస్తామన్నారు. ‘పిల్లల చదువుకు ఒక్కో బిడ్డకు పదిహేను వేలు.. దీపం కింద ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు.. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత సౌకర్యం.. డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేకుండా పది లక్షల వరకు రుణాలు..” ఇస్తామని చంద్రబాబు తెలిపారు. నిరుద్యోగులకు జాబు రావాలంటే బాబు రావాలన్నారు. ఎండ ఉందని ఏమారితే కొంపలే కూలిపోతాయన్నారు. జగన్‌కు ఓటేస్తే మీ ఆస్తులు గోవిందా.. రికార్డులు మొత్తం ఆయన చేతుల్లో ఉంటాయని.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారం మీ ఆస్తులకు హక్కులు మొత్తం ఆయనకే ఉంటాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అసలు ఆ చట్టం ఎందుకో సమాధానం చెప్పాలన్నారు. మీరు రద్దు చేయకపోతే మేము రాగానే మొదటి సంతకం మెగా డీఎస్సీ.. రెండవ సంతకం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ రద్దుపై రెండో సంతకం పెడతామన్నారు. రికార్డులు తారుమారు చేయటం న్యాయమా అని అడుగుతున్నామన్నారు.
ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది.. ఏడాదికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ప్రపంచంలో ఎలాంటి అవకాశాలు ఉన్నాయో చెప్పి.. నేర్పించి.. ఉద్యోగాలు ఇప్పిస్తామన్నారు. సామాజిక పెన్షన్లు మొత్తం పెంచుతామన్నారు. ఏప్రిల్ నుంచి పెంచిన నాలుగు వేల పెన్షన్ ఇచ్చే బాధ్యత మాది అని చంద్రబాబు హమీ ఇచ్చారు. “దివ్యాంగులకు ఆరు వేల పెన్షన్.. చంద్రన్న భీమా తెస్తాం..బీసీలకు రుణం తీసుకునే సమయం వచ్చింది..స్వర్ణకారుల కోసం ప్రత్యేక కార్పొరేషన్.. మద్యాన్ని నియంత్రణ చేస్తాం… వందరోజుల్లో గంజాయి, డ్రగ్స్ రాష్ట్రంలో లేకుండా చేస్తాం.. ఈ నియోజకవర్గంలో ఏక పక్షంగా గెలిపించిన పెద్ద మనిషి ఎక్కడ ఉన్నాడు.. పనుల కోసం కక్కుర్తి పడే వాళ్ళు మనకు అవసరమా.. ఇబ్బందులు పడ్డవాళ్ళు అడ్డదారులు తొక్కలేదే.. అయారం.. గయారం.. మనకు అవసరం లేదు.. ఇంకొక ఆయన ఉన్నాడు.. ఎంఎల్ఏ వచ్చి పార్టీలో చేరాడు.. అన్నీ పనులు చేయించుని ఎన్నికలకు ముందే వెళ్ళిపోయాడు.” అని చంద్రబాబు స్పష్టం చేశారు.