NTV Telugu Site icon

Peddireddy Ramachandra Reddy: ఇసుకను దోచిన వారే ఆరోపణలు చేయటం విడ్డూరం

Peddireddy Ramachandra Reddy

Peddireddy Ramachandra Reddy

Peddireddy Ramachandra Reddy: టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మైనింగ్ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఇసుకాసురుడు అంటు చంద్రబాబు జగన్‌పై ఆరోపణలు చేశారని, ఇసుక విధానం పై 19 సార్లు చంద్రబాబు జీవోలు తెచ్చారని పేర్కొన్న మంత్రి.. ఇసుకను దోచిన వారే ఆరోపణలు చేయటం విడ్డూరంగా ఉందన్నారు. శాఖను సక్రమంగా నిర్వహించటం వల్లే ఆదాయాలను పెంచగలిగామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఉచితం అని చెప్పి ప్రజలకు సున్నం పెట్టింది ఎవరంటూ ఆయన ప్రశ్నించారు. ఎమ్మార్వో వనజాక్షి అక్రమ ఇసుక రవాణాను అడ్డుకుంటే చంద్రబాబు ఏం చేశాడని మంత్రి ప్రశ్నలు గుప్పించారు. అప్పట్లో లోకేష్‌కు ప్రతి నెల 500 కోట్లు ముట్టేవని ఆరోపణలు ఉన్నాయన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఎన్జీటీనే 100 కోట్ల జరిమానా విధించిందని.. కరకట్ట ఇసుక తవ్వకాలపై పెనాల్టీ వేసింది వాస్తవం కాదా అని పేర్కొన్నారు.

Also Read: Bandi Sanjay: బండి సంజయ్ అమెరికా పర్యటన.. 10 రోజుల పాటు యూఎస్‌లోనే!

వైసీపీ ప్రభుత్వం రాగానే మెరుగైన ఇసుక విధానం తీసుకుని వచ్చామని ఈ సందర్భంగా చెప్పారు. జీవో 25తో ఆపరేషన్స్ అన్నీ చేస్తున్నామన్నారు. చంద్రబాబు హయాంలో ఇన్ని వేల కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్ళాయని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు ఏడాదికి 750 కోట్ల ఆదాయం వస్తోందని.. రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత ఆదాయం వస్తుందని తెలిసి కూడా చంద్రబాబు ఎందుకు టెండర్లు వేయలేదన్నారు. సమస్యలు ఉంటే ఎవరికి చెప్పాలో కూడా తెలియని పరిస్థితి అప్పుడు ఉండేదని.. ఇప్పుడు టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టామని మంత్రి స్పష్టం చేశారు. మైనింగ్‌పై కఠిన చట్టాలు కూడా చేశామని మంత్రి వెల్లడించారు. దాదాపు 18 వేల కేసులు నమోదు చేశామన్నారు. స్పెషల్ ఎన్‌ఫోర్స్ టీం ఏర్పాటు చేశామన్న మంత్రి.. వర్షాకాలంలో ఇసుక కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. అక్రమ రవాణాపై కఠిన చర్యలు కూడా తీసుకుంటున్నామన్నారు. ఇసుక స్టోరేజ్ పాయింట్ల దగ్గరకు వెళ్ళి తండ్రి, కొడుకులు సెల్ఫీలు దిగుతారని.. చంద్రబాబు హయాంలో మైనింగ్‌లో రెవెన్యూ 2 వేల కోట్లు దాటలేదన్నారు.

గత నాలుగేళ్లల్లో ఆదాయం గణనీయంగా పెరిగిందని.. 2022-23లో 4,756 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. ఇంత ఆదాయం వచ్చింది అంటేనే శాఖ ఎంత పారదర్శకంగా పని చేస్తుందో అర్థం అవుతుందన్నారు. రాజశేఖరరెడ్డి పేరు చెబితే ఆరోగ్య శ్రీ, జగన్ పేరు చెబితే అమ్మ ఒడి గుర్తుకు వస్తాయని మంత్రి చెప్పారు. చంద్రబాబుకు చెప్పుకోవటానికి ఒక పథకం లేదు, ప్రాజెక్టు లేదని.. అయనకు ఫస్ట్, సెకెండ్, థర్డ్ ఆర్డర్లు అంటే ఏంటో కూడా తెలియదన్నారు.

దొంగఓట్లపై మంత్రి మండిపాటు
దొంగ ఓట్లపై కూడా మంత్రి పెద్దిరెడ్డి మండిపడ్డారు. టీడీపీ హయాంలోనే దొంగ ఓట్లు నమోదు చేశారని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో 60లక్షల దొంగ ఓట్లను చేర్పించారని ఆయన పేర్కొన్నారు. కుప్పంలో మున్సిపల్‌ ఎన్నికల్లో 12వేల దొంగ ఓట్లు గుర్తించామన్న మంత్రి.. కుప్పంలో ఇంకా దొంగ ఓట్లు ఉన్నాయన్నారు. వాటి మీద కూడా అభ్యంతరం వ్యక్తం చెబుతామన్నారు. 2018లోనే 60 లక్షల ఓట్లు చేర్పించారన్నారు. దొంగ ఓట్లను కాపాడుకోవడం కోసం చంద్రబాబు ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు.