Chandrababu Arrested Live Updates: చంద్రబాబు నాయుడిపై రిమాండ్ రిపోర్ట్‌లో సీఐడీ సంచలన అభియోగాలు చేసింది. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబుకు పూర్తి అవగాహన ఉందని, ఆయన ఆదేశాల మేరకే డబ్బులు విడుదలయ్యాయని పేర్కొంది. ఏసీబీ కోర్టులో హోరాహోరీగా వాదనలు నడుస్తున్నాయి. చంద్రబాబు తనయుడు నారా లోకేష్ కోర్టులోనే ఉన్నారు. చంద్రబాబు తరఫున లాయర్ సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపిస్తుండగా.. సీఐడీ తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదిస్తున్నారు. సీఐడీ తరపున వివేకా చారి, వెంకటేష్ న్యాయవాదులు హాజరయ్యారు. రిమాండ్ రిపోర్టులో నారా లోకేష్ పేరును కూడా సీఐడీ ప్రస్తావించింది. చంద్రబాబు సన్నిహితుడు కిలారి రాజేశ్ ద్వారా లోకేష్‌కు డబ్బులు అందాయని పేర్కొంది. 409 సెక్షన్ కింద వాదనలు జరుగుతున్నాయి.
న్యాయస్థానం తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ.. రిమాండ్ రిపోర్ట్‌ను కోర్టుకు సమర్పించిన సీఐడీ అధికారులు.. రిమాండ్ రిపోర్ట్‌లో నారా లోకేష్ పేరు.. చంద్రబాబు సన్నిహితుడు కిలారు రాజేష్ ద్వారా లోకేష్‌కు డబ్బులు అందినట్లు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్న సీఐడీ.. రిమాండ్ రిపోర్ట్‌లో బయటకొచ్చిన కీలక అంశాలు
హైదరాబాద్ నుంచి విజయవాడకు వస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గరికపాడు చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. దీంతో జనసేన కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. అక్కడి నుంచి తీవ్ర ఉద్రిక్తతల నడుమ పవన్.. కార్యకర్తలతో కలిసి వస్తున్నారు. అయితే మరోవైపు పవన్ కల్యాణ్ విజయవాడకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటుండంతో పవన్ జాతీయ రహదారి పై బైఠాయించారు. అనుమంచుపల్లి దగ్గర పవన్ కల్యాణ్ పోలీసులు అడ్డుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా వెళ్లి తీరాల్సిందేనని పవన్ అంటున్నారు. మరోవైపు ఏపీలోకి రావటానికి వీసా, పాస్ పోర్ట్ కావాలేమోనని పవన్ అన్నారు. ఆయన అన్న మాటలను నాదెండ్ల మనోహర్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
చంద్రబాబును 4 గంటలకు పైగా విచారిస్తున్న సీఐడీ.. చంద్రబాబుకు ప్రభుత్వ ఆసుపత్రిలో కాకుండా కోర్టులోనే వైద్య పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. సిట్ కార్యాలయం నుంచి నేరుగా చంద్రబాబును కోర్టుకు తరలించనున్నారు. కోర్టులోనే వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు డాక్టర్లు. అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అంబులెన్స్ మెడికల్ ఎక్విప్మెంట్ కోర్టు వద్దకు వైద్యుల బృందం తీసుకొచ్చింది. చంద్రబాబును హాస్పిటల్ నుంచి కోర్టుకు తీసుకురావడానికి సమయం పట్టే అవకాశం ఉండటంతో కోర్టు వద్ద ఏర్పాట్లు చేశారు పోలీసులు.
జగ్గయ్యపేటలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. హైదరాబాద్ నుంచి బెజవాడ వస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పవన్ కు స్వాగతం పలికేందుకు వచ్చిన జనసైనికులపై పోలీసులు విరుచుకుపడ్డారు. దీంతో పోలీసులకు, జనసేన కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో జనసైనికులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. మరోవైపు పవన్ కల్యాణ్ కారు ముందు పెట్టిన బారికేడ్లు, డబ్బాలను పార్టీ కార్యకర్తలు తొలగించారు. దీంతో గరికపాడు చెక్ పోస్ట్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
సీఐడీ ఆధీనంలో ఉన్న చంద్రబాబుని తన కుటుంబ సభ్యులు కలిశారు. అనంతరం బాబును కలిసి భువనేశ్వరి, బాలకృష్ణ, లోకేష్, బ్రహ్మాణి వెనుతిరిగారు. చంద్రబాబును కలవడానికి సుమారు రెండు గంటలసేపు లోకేష్, భువనేశ్వరి వెయిట్ చేసారు. ఇంకా సీఐడీ చంద్రబాబును విచారిస్తుంది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయవాడకు బయల్దేరారు. రోడ్డు మార్గం ద్వారా బెజవాడకు వస్తున్నారు. దీంతో జగ్గయ్యపేట దగ్గర జనసేన నేతలు స్వాగతం పలికారు. ఇంతకుముందు విమానం ద్వారా హైదరాబాద్ నుంచి విజయవాడకు బయల్దేరిన పవన్ విమానాన్ని విమానాశ్రయ అధికారులు, పోలీసులు ఆపారు. మరోవైపు ఏపీ - తెలంగాణ బోర్డర్ దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. హైదరాబాద్ నుంచి ఏపీకి వస్తున్న పవన్ కల్యాణ్ ను గరికపాడు చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ శాంతియుత నిరసనలు, ర్యాలీలు చేపట్టేందుకు పోలీసులు అడ్డురాకుండా అనుమతి ఇవ్వాలని ఏపీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేశారు. మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఈ పిటిషన్ వేశారు. హౌస్ అరెస్టులు, అక్రమ అరెస్టులు చేస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని పిటిషన్ లో తెలిపారు. ఆ పిటిషన్ ను ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్ కు అందజేశారు. న్యాయవాది బాలాజీ యలమంజుల పిటిషన్ వేశారు.
ఎమ్మెల్యే బాలకృష్ణ బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి విజయవాడకు బయలుదేరడానికి లోపలికి వెళ్లారు. చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టే ఆలోచన తప్ప.. ఆ కేసులో ఏమీ లేదని ఆయన అన్నారు. ఇన్నాళ్లు చార్జి షీట్ వేయకుండా ఎందుకున్నారు!. తాను కూడా ఎన్నో క్యాంపులు పెట్టానని.. కావాలని జైల్లో పెట్టేందుకు ఈ కేసు బయటకు తీశారని బాలకృష్ణ అన్నారు.
సిట్ కార్యాలయంలోకి చంద్రబాబు అడ్వకేట్లను పోలీసులు అనుమతించలేదు. దీంతో అధికారుల తీరుపై అడ్వకేట్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ అడ్వకేట్లను అనుమతించి.. చంద్రబాబు లాయర్లు నిలిపివేయడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం అరెస్ట్ నుంచి ఇప్పటి వరకు అన్నింటిలో నిబంధనలకు విరుద్ధంగా దర్యాప్తు అధికారులు పని చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
పవన్ బెజవాడ ప్రయాణం వాయిదా పడింది. పవన్ శంషాబాద్ నుంచి రావాల్సిన విమానం టేకాఫ్ కు నిరాకరించడంతో వాయిదా పడింది. దీంతో గన్నవరం విమానాశ్రయం దగ్గర నుంచి నాదెండ్ల మనోహర్ వెనుతిరిగి వెళ్లిపోయారు.
తాడేపల్లి సీఐడీ సిట్ కార్యాలయానికి చంద్రబాబు వచ్చారు. కాసేపట్లో చంద్రబాబును కోర్టులో ప్రవేశపెట్టనుంది సీఐడీ. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించనున్నారు. ఇప్పటికే సీఐడీ కార్యాలయానికి భారీగా టీడీపీ కార్యకర్తలు చేరుకోగా.. భారీగా పోలీసులు మోహరించారు.
స్కిల్ స్కామ్ లో ఒక గజ దొంగల ముఠా ఏర్పడిందని ఎమ్మెల్యే కన్నబాబు ఆరోపించారు. పథకం ప్రకారం కుట్ర జరిగిందని తెలిపారు. సీమెన్స్ సంస్థ యొక్క పరిధి చూడలేదని.. సీమెన్స్ సంస్థ ఎండీ ఒప్పందం జరిగినప్పుడు సుమన్ బోస్ అని దొంగ సంతకాలు పెట్టాడని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలోనే ఏసిబీకి స్కిల్ డెవలప్మెంట్ పై ఫిర్యాదులు అందాయని తెలిపారు. మరోవైపు చంద్రబాబు సత్య హరిశ్చంద్రుడులా.. తోక పార్టీలు మాట్లాడుతున్నాయని దుయ్యబట్టారు. పురందేశ్వరి, పవన్, రేవంత్ రెడ్డి చాలా బాధపడుతూ చంద్రబాబు అరెస్ట్ పై మాట్లాడుతున్నారని తెలిపారు. చంద్రబాబు చేసిన స్కామ్ కంచికి చేరిపోయిందని విమర్శించారు.
అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి కేసు పూర్వాపరాలు బ్రీఫింగ్ చేస్తున్నారు. స్కిల్ కుంభకోణం, చంద్రబాబు అరెస్టుకు సంబంధించిన అంశాలను సీఐడీ అధికారులు బ్రీఫ్ చేస్తున్నారు. మరోవైపు చంద్రబాబును జ్యుడిషియల్ కస్టడీని కోరనుంది ఏఏజీ.
విజయవాడలో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. శాంతి భద్రతల సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. చంద్రబాబును కలిసేందుకు పవన్‌కు అనుమతి లేదని పోలీసు వర్గాలు అంటున్నాయి. చంద్రబాబు కుటుంబ సభ్యులకు తప్ప మరెవ్వరికీ అనుమతి లేదని చెబుతున్నారు. భువనేశ్వరి, లోకేశ్‌లకు మాత్రమే అనుమతి ఇస్తామని పేర్కొన్నారు. ఉద్రిక్తతల కోసం పవన్ వస్తున్నారని తమకు సమాచారం ఉందని పోలీసు వర్గాలు అంటున్నాయి. ఈ మేరకు ఎయిర్‌పోర్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. పవన్ ప్రత్యేక విమానాన్ని అనుమతించి వద్దని ఎయిర్‌పోర్టు అధికారులకు సమాచారం పంపారు పోలీసులు.
చట్టానికి లోబడి పని చేస్తానని చెప్పి చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ అన్నారు. ప్రజలు సిగ్గు పడే విధంగా బాబు వ్యవహరించారని తెలిపారు. షెల్ కంపెనీలు సృష్టించి ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. సిమెన్స్ కంపెనీ పేరు చెప్పి రూ.370 కోట్లు షెల్ కంపెనీలకు మళ్ళించారని పేర్కొన్నారు. అమరావతిలో చంద్రబాబు పది వేల ఎకరాల ల్యాండ్ మాఫియా చేసాడని ఎంపీ తెలిపారు.
తాడేపల్లి కుంచనపల్లిలోని సిట్ ఆఫీసుకు చంద్రబాబు సెకెండ్ కాన్వాయ్ చేరుకుంది. చంద్రబాబు ఇక్కడ కాన్వాయ్ మారుతారని తెలుస్తోంది. అయితే పోలీసులు మాత్రం ఈ అంశంపై స్పష్టత ఇవ్వలేదు.
చంద్రబాబు అరెస్ట్ పై మంత్రి జోగి రమేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ఎప్పుడో అరెస్టు కావలసిందని అన్నారు. చంద్రబాబు పాపం పండిందని.. రూ.371 కోట్ల ప్రజల డబ్బులు అప్పణంగా మింగేశాడని ఆరోపించారు. చంద్రబాబు అరెస్టు రాష్ట్రానికి శుభ పరిణామని మంత్రి పేర్కొన్నారు
విజయవాడ సివిల్ కోర్టు వద్ద పోలీసులు భారీ బందోస్తు నిర్వహించారు. 3వ అదనపు జిల్లా మరియు ఏసిబి కోర్టు జడ్జి వద్ద చంద్రబాబును హాజరు పరచనున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలో దాదాపు 200 మంది పోలీసులు మోహరించారు. స్పెషల్ పార్టీ, టాస్క్ ఫోర్స్, సివిల్, ఏఆర్, ఏపీఎస్పీ బెటాలియన్ లతో రక్షక వలయంగా ఉన్నారు.
స్కిల్ డెవలప్‌మెంట్ మొత్తం ప్రాజెక్ట్ అంచనా రూ.3,356 కోట్లు.. ఇందులో ఏపీ ప్రభుత్వం ఇచ్చింది రూ. 371 కోట్లు.. జీఎస్టీ పోను మిగిలింది రూ.330 కోట్లు.. అందులో రూ.58 కోట్లు మాత్రమే సాఫ్ట్‌వేర్ కోసం, మరో రూ.130 కోట్లు స్కిల్ సెంటర్లలో పరికరాలు, ఇతర వసతుల కోసం ఖర్చు చేశారు. రూ.120 కోట్లు దారి మళ్లించారు.. అవి ఎక్కడకు వెళ్లాయనేది దర్యాప్తు చేస్తున్నాం అని ఏపీ సీఐడీ వెల్లడి..
ప్రాథమిక ఆధారాలు చూపకుండా అర్ధరాత్రి అరెస్టు చేసే విధానానాన్ని వైసీపీ ప్రభుత్వం అవలంభిస్తుంది.. గత యేడాది అక్టోబర్ లో విశాఖలో కూడా జనసేన పట్ల ఏ విధంగా వ్యవహరించారో అందరూ చూశారు.. ఏ తప్పూ చేయని జనసేన నాయకులపై హత్యాయత్నం కేసు పెట్టి అన్యాయంగా అరెస్టు చేశారు. చంద్రబాబును అరెస్టు చేసిన తీరును సంపూర్ణంగా జనసేన ఖండిస్తుంది.. పాలనా పరంగా ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి పట్ల అనుసరిస్తున్న వైఖరి కరెక్టు కాదు. చంద్రబాబు వీటి నుంచి బయటపడాలని జనసేన సంపూర్ణ మద్దతు తెలియ చేస్తుందని తెలిపారు పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల రాకపోకలపై ఎలాంటి ఆంక్షలు లేవు.. యథా ప్రకారం అన్ని సర్వీసులు నడుస్తాయి.. ప్రయాణికులు యథా ప్రకారం తమ ప్రయాణాలు చేసుకోవచ్చు-ఏపీఎస్‌ఆర్టీసీ
జగన్ పాలకుడు కాదు కక్షదారుడు.. చంద్రబాబు అక్రమ అరెస్టు దుర్మార్గం.. జగన్ సీఎం అయ్యాక అన్నం తినటం మానేసి కోర్టుల చేత చివాట్లు తింటున్నారు.. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలి ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపులకు పాల్పడే ముఖ్యమంత్రి ఉండటం రాష్ట్ర ప్రజల దౌర్బాగ్యం.. నేను 16 నెలలు జైల్లో ఉన్నాను, చంద్రబాబుని 16 నిమిషాలైన జైల్లో పెట్టాలన్నదే తన జీవిత లక్ష్యమన్నట్టు జగన్ కక్ష సాధిస్తున్నారు అని నందమూరి బాలకృష్ణ మండిపాటు..
తెలుగువారి ప్రయోజనాలను కాపాడేందుకు నా ప్రాణాలను త్యాగం చేసేందుకు కూడా నేను సిద్ధం.. గత 45 ఏళ్లుగా తెలుగు ప్రజలకు నిస్వార్థంగా సేవ చేశాను.. తెలుగు ప్రజలకు, రాష్ట్రానికి, మాతృభూమికి సేవ చేయకుండా నన్ను ఏ శక్తీ ఆపలేదు అంటూ ట్వీట్ చేసిన చంద్రబాబు
45 ఏళ్ళ నా రాజకీయ జీవితం మీద మచ్చ వేయడానికి ఎన్నో కుట్రలు జరిగాయి. కానీ ఎవరివల్లా కాలేదు. ఎందుకంటే నిప్పులా బతికా. తెలుగు ప్రజల బాగు గురించి ఆలోచించడం తప్ప, నాకు మరొక ధ్యాస ఉండదు. ప్రజల గురించి పోరాడుతున్నా కాబట్టే ఈ రోజు ఈ బెదిరింపులు...అక్రమ అరెస్టులు. ఇవి ఏవీ నన్ను, నా ప్రజల… pic.twitter.com/wAbjhWQWBj
— N Chandrababu Naidu (@ncbn) September 9, 2023
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. చంద్రబాబు అరెస్టులో అసలు విషయం పక్కకు వెళ్లేలా టీడీపీ నేతలు గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు.. చంద్రబాబు అరెస్ట్‌లో ఎలాంటి దురుద్దేశాలు లేవు.. బలమైన ఆధారాలతోనే సిట్ వేశాం.. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఎంతో సంయమనంతో ఉందన్నారు.. దర్యాప్తు సంస్థలు ఎంతో స్వేచ్చగా దర్యాప్తు చేస్తున్నాయన్న ఆయన.. స్వాతంత్ర్య భారత దేశంలో అత్యంత హేయమైనది ఆర్ధిక నేరం.. స్కీమ్ పేరుతో స్కామ్ చేశారని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి.. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి టీడీపీ శ్రేణులు.. దీంతో.. అలర్ట్ అయిన పోలీసులు.. ముందు జాగ్రత్త చర్యగా.. టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తు్న్నారు. మరోవైపు.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా.. ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు.. డిపోలు, బస్టాండ్‌లో బస్సులు నిలిచిపోయాయి..