Chandrababu: ఎన్నికల్లో గెలుపొందిన టీడీపీ ఎంపీలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఉండవల్లిలోని ఆయన నివాసంలో టీడీపీ పార్లమెంటరీ భేటీ నిర్వహించారు. సుమారు గంటన్నరపాటు సాగిన టీడీపీపీ సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పని చేయాలని ఎంపీలకు చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. ఎన్నికల్లో గెలిచిన ఎంపీలకు చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలిచ్చిన తీర్పుతో ఎవరూ ఆకాశంలో ఎగరొద్దని.. ప్రజలు నమ్మకంతో ఇచ్చిన విజయాన్ని బాధ్యతగా సమాజ సేవ చేసేందుకు వినియోగించాలన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు పట్టించుకోని వైసీపీ ఎంపీలు జగన్ కేసుల మాఫీ అజెండాతోనే ఢిల్లీలో పైరవీలు చేశారని ఆరోపించారు.
Read Also: Botsa Satyanarayana: అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి చేసుకొచ్చాం.. నష్టపడినా, లాభపడినా ప్రజానీకమే..!
రాష్ట్ర ప్రయోజనాలే మనందరి ప్రథమ కర్తవ్యం కావాలని ఎంపీలకు సూచించారు. స్టేట్ ఫస్ట్ నినాదంతోనే పార్లమెంట్ వేదికగా కృషి చేయాలన్నారు. ముందు ప్రజాస్వామ్య వ్యవస్థల్ని గౌరవించాలి, ఆ తర్వాతే మనం అంటూ చంద్రబాబు పేర్కొన్నారు. వ్యవస్థలకు ఆతీతంగా ఎవరు వ్యవహరించినా, ఆ వ్యవస్థే తిరిగి కాటేస్తుంది అని గుర్తించాలన్నారు. పదవులు శాశ్వతం అని ఎవ్వరూ అనుకోవద్దన్నారు. మన ప్రమాణ స్వీకారానికి మోడీని ఆహ్వానించాం, ఆయన వచ్చేందుకు సానుకూలంగా స్పందించారన్నారు.
సమావేశం అనంతరం టీడీపీ ఎంపీలు మీడియాతో మాట్లాడారు. గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, విశాఖ ఎంపీ భరత్, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుతో సమావేశం కావడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇంత పెద్ద మెజార్టీ సాధించడానికి పరోక్షంగా వైసీపీ కూడా కారణమేనన్నారు. ఇంత భారీ విజయం సాధించడానికి మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌తో పాటు తెలుగు ప్రజల ఉన్న కసి దీనికి కారణమన్నారు. ఎన్నికల ముందు నుంచి మేము ఎన్డీఏ కూటమితోనే కలిసి ప్రయాణిస్తున్నామన్నారు. ఎన్డీఏ కూటమికే మా సంపూర్ణ మద్దతు అంటూ టీడీపీ ఎంపీలు పేర్కొన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి అనేకాంశాల్లో వారి మద్దతు కావాలన్నారు. విశాఖ స్టీల్ కర్మాగారం అంశంతో పాటు వివిధ పార్లమెంటు నియోజకవర్గం అనేక అంశాలు పరిష్కారం కావాలని ఎంపీలు వెల్లడించారు.