CM Chandrababu: “తక్షణమే ఆదుకోండి”.. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు సీఎం చంద్రబాబు లేఖ

Chandrababu Letter Amit Shah

Chandrababu Letter Amit Shah

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో సంభవించిన వరుస తుఫాన్ల విధ్వంసంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు లేఖ రాశారు. అర్నబ్ తుఫాన్ తెచ్చిన నష్టం నుంచి కోలుకోకముందే, వారం వ్యవధిలోనే మురసు తుఫాన్ రావడం రాష్ట్ర తీవ్రంగా దెబ్బతీసిందని సీఎం పేర్కొన్నారు. ఒకే సీజన్‌లో వరుసగా రెండుసార్లు తుఫాన్లు విరుచుకుపడటంతో రైతులు, మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయారని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.

మురసు తుఫాన్ కారణంగా ప్రాథమికంగా రూ.1,919.59 కోట్ల నష్టం వాటిల్లిందని సీఎం అంచనా వేశారు. తుఫాన్ ధాటికి 1,43,122 హెక్టార్లలో పంటలు దెబ్బతినగా, 1,86,063 మంది రైతులపై దీని ప్రభావం పడింది. దీంతో వ్యవసాయ రంగానికి రూ.874.96 కోట్లు, ఉద్యాన పంటలకు రూ.337.10 కోట్ల నష్టం వాటిల్లింది. పంటలతో పాటు విద్యుత్‌, రహదారులు, ఇరిగేషన్‌, పంచాయతీరాజ్‌, విద్య, వైద్యారోగ్య రంగాల్లోనూ తీవ్రస్థాయిలో మౌలిక వసతులు దెబ్బతిన్నాయి. బాధిత రైతులు, మత్స్యకారులు, కుటుంబాలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణ మధ్యంతర ఆర్థిక సాయం అందించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. మరో 15 రోజుల్లో పూర్తిస్థాయి నష్ట నివేదికను కేంద్రానికి సమర్పిస్తామని సీఎం వివరించారు.