Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లో మంత్రివర్గ కూర్పుపై చంద్రబాబు దృష్టి పెట్టనున్నారు. భారీ మెజారిటీతో గెలిచిన కూటమి సభ్యులతో కలిసి పూర్తిస్థాయిలో మంత్రివర్గం ఉండేలా కసరత్తు చేయనున్నట్లు తెలుస్తోంది. ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి ఎక్కువగా స్థానాలను కైవసం చేసుకుంది. మూడు పార్టీలు కలిసి మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గానూ 164 సీట్లను కైవసం చేసుకుంది. ఈ నెల 12న ఉదయం 11.27 గంటలకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నెల 11న టీడీపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. టీడీఎల్పీ భేటీ అనంతరం టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో కూటమి ఎమ్మెల్యేలు చంద్రబాబును తమ నాయకుడిగా ఎన్నుకుంటారు. జనసేనకు 21, బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ నేపథ్యంలో, జనసేన, బీజేపీలకు ఎన్ని మంత్రి పదవులు దక్కుతాయన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా, పవన్ కల్యాణ్ మంత్రి పదవిని తీసుకుంటారా? ఒకవేళ తీసుకుంటే ఏ శాఖను ఎంచుకుంటారు? అనేది అత్యంత చర్చనీయాంశంగా మారింది. మరోవైపు, పూర్తి స్థాయి క్యాబినెట్ తో పరిపాలన ప్రారంభించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ముఖ్యమంత్రితో కలిపి 26 మందితో క్యాబినెట్ ప్రకటించే అవకాశాలున్నాయి. ఏపీ క్యాబినెట్ కూర్పుపై ఎన్డీయే పెద్దలు చంద్రబాబుకు స్వేచ్ఛ ఇచ్చినట్టు తెలుస్తోంది.
Read Also: Balakrishna Birthday: కార్యకర్తలు, అభిమానుల మధ్య ఘనంగా బాలయ్య జన్మదిన వేడుకలు
నిన్నటివరకు ఢిల్లీ ముఖ్యనేతలతో బిజీబిజీగా గడిపిన చంద్రబాబు నేడు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకోనున్నారు. మధ్యాహ్నం ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు మంత్రివర్గంపై కసరత్తు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై ఇప్పటికే జనసేన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్‌తో పాటు బీజేపీ నేతలతోనూ చర్చించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పవన్‌కళ్యాణ్‌కు డిప్యూటీ సీఎంతో పాటు మరో కీలక మంత్రి పదవి అప్పజెప్పే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఆయన సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తి కావడంతో ఏపీలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్దికి కృషిచేసేందుకు సినిమాటోగ్రఫీ శాఖను కేటాయించనున్నట్లు కూడా ఓ వర్గం నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి సతీసమేతంగా హాజరైన సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమంలో మీడియా ప్రతినిధులు పవన్‌తో మాట్లాడేందుకు పోటీపడ్డారు. జాతీయ మీడియా పవన్‌ను పదవులపై ప్రశ్నించగా.. ఆయన ఏదో చెప్పారు. స్పష్టంగా వినిపించలేదు. కానీ ఆయన ఉపముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నట్లు జాతీయ మీడియా వర్గాలు తెలిపాయి. ఏదేమైనా కూటమి సభ్యులు భారీగా గెలుపొందడంతో కేబినెట్ కూర్పు కత్తిమీద సాములా మారిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఎవరికి ఏశాఖలు వరిస్తాయో తెలియాలంటే చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేసేవరకు వేచి చూడాల్సిందే.