NTV Telugu Site icon

Chandrababu and Pawan Kalyan: చంద్రబాబు, పవన్‌ ఉమ్మడి ప్రచారం.. నేడు అమలాపురంలో ట్రాఫిక్‌ ఆంక్షలు

Babu Pawan

Babu Pawan

Chandrababu and Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో అన్ని పార్టీలు ప్రచారంలో స్పీడ్‌ పెంచుతున్నాయి.. ఓ వైపు సీఎం వైఎస్‌ జగన్‌ మేమంతా సిద్ధం పేరుతో ప్రజల్లోకి వెళ్తుంటే.. మరోవైపు విపక్షాలు సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నాయి.. ఈ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ జట్టుకట్టిన విషయం విదితమే కాగా.. ఈ మూడు పార్టీల నేతలు ఉమ్మడిగా ప్రచారం చేస్తున్నారు.. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్‌ పవన్‌ కల్యాణ్‌ ఉమ్మడిగా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్న విషయం విదితమే కాగా.. బుధవారం నుంచి మరోసారి ఇద్దరూ కలిసి ప్రచారం నిర్వహించారు.. ఇక, ఈ రోజు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో ఇద్దరి పర్యటన కొనసాగనుంది.. అమలాపురం, పి.గన్నవరం నియోజకవర్గాల్లో పర్యటించబోతున్నారు..

పి.గన్నవరం నియోజకవర్గం అంబాజీపేటలో జరగబోయే ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ పాల్గొంటారు.. మధ్యాహ్నం అంబాజీపేట, సాయంత్రం అమలాపురం బహిరంగ సభలో పాల్గొననున్నారు ఇద్దరు నేతలు.. అయితే, ఇరు పార్టీల అధినేతలు వచ్చేందుకు వీలుగా అంబాజీపేట హైస్కూలులో హెలిప్యాడ్‌ సిద్ధం చేస్తున్నారు టీడీపీ నేతలు.. మరోవైపు బహిరంగ సభకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.. వేలాదిగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు, నాయకులకు పిలుపునిచ్చారు. విముక్తాంధ్రప్రదేశ్ సాధించడమే ధ్యేయంగా జరగబోయే సభకు ప్రతి ఒక్కరు రావాలన్న టీడీపీ నేతలు కోరుతున్నారు.

మరోవైపు నేడు నారా చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ ఉమ్మడి బహిరంగ సభ దృష్ట్యా అమలాపురంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు.. అమలాపురం మీదుగా వెళ్లే వాహనాలకు అమలాపురం పట్టణంలోకి అనుమతిలేదని స్పష్టం చేశారు.. ఈ రోజు సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఈ ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లు ఉంటాయని పేర్కొన్నారు.. కాకినాడ, రాజమండ్రి, రాజోలు, పి.గన్నవరం వైపు వెళ్లే వాహనాలను వివిధ మార్గాల్లో మళ్లించామని.. ట్రాఫిక్‌ ఆంక్షలు, సూచనలు గమనిస్తూ.. ఇబ్బంది లేకుండా.. ప్రయాణికులు తమ ప్రయాణాలు కొనసాగించాలని సూచించారు పోలీసులు.