ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేవలం టీడీపీ నేతల కోసం పనిచేస్తారా?.. లేదా ప్రజలందరి కోసం పనిచేస్తారా? అని వైసీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ప్రశ్నించారు. తన కొడుకును సీఎం చేసుకోవటానికి నారా లోకేష్ నియోజకవర్గానికి నిధులు మళ్లిస్తున్నారన్నారని, ప్రశ్నించిన వైసీపీ నాయకులపై అక్రమ కేసులుపెట్టి జైళ్లకు పంపిస్తున్నారన్నారు. వెలిగొండ ప్రాజెక్టు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కు నిధులు కేటాయింపులు చేయకుండా మంత్రి నిమ్మల మాటలతో సరిపెడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడు కాదు.. విషం చిమ్మే నాయకుడు అన్నట్లుగా చిత్తూరు పర్యటనలో మాట్లాడారని ఎమ్మెల్యే తాటిపర్తి పేర్కొన్నారు.
అమరావతిలో ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ… ‘చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడు అని టీడీపీ నేతలు డబ్బా కొడతారు. చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడు కాదు.. విషం చిమ్మే నాయకుడు అన్నట్లుగా చిత్తూరు పర్యటనలో మాట్లాడారు. ఇంత ద్వేషాన్ని కడుపులో పెట్టుకొని బాబు రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేస్తారా?. నేను రాజకీయాలు మాత్రమే చేస్తా.. సుపరిపాలన కాదు అన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. హోంమంత్రి మేము అనుకుంటే వైసీపీ నేతలు రోడ్ల మీద తిరగలేరు అన్నట్లుగా మాట్లాడుతారు. రాగ ద్వేషాలతో సీఎం, హోంమంత్రి మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి కేవలం టీడీపీ నేతల కోసం పనిచేస్తారా? లేక ప్రజలందరి కోసం పనిచేస్తారా?’ అని ప్రశ్నించారు
‘తన కొడుకును సీఎం చేసుకోవటానికి నారా లోకేష్ నియోజకవర్గానికి సీఎం నిధులు మళ్లిస్తున్నారు. ప్రశ్నించిన వైసీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపిస్తున్నారు. గత వైసీపీ హయంలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ వైస్ జగన్ పథకాలు అందించారు. ఈ వ్యాఖ్యలపై చంద్రబాబు క్షమాపణ చెప్పాలి.. లేకుంటే రాజీనామా చేయాలి. చంద్రబాబు వ్యాఖ్యలపై గవర్నర్ స్పందించాలి. వెలిగొండ ప్రాజెక్టుపై నిజాలు మాట్లాడే దమ్ము మీకుందా?. మంత్రి నిమ్మల వెలిగొండ ప్రాజెక్టు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కు నిధులు కేటాయింపులు చేయకుండా మాటలతో సరిపెడుతున్నారు. వెలిగొండ కోసం త్వరలో పాదయాత్ర చేస్తా’ అని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ చెప్పుకొచ్చారు.