Site icon NTV Telugu

Champions Trophy 2025: ఛాంపియన్స్‌ ట్రోఫీపై అనిశ్చితి.. భారీ మార్పు తప్పదా?

Champions Trophy 2025

Champions Trophy 2025

ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025కి పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వాలి. భద్రతా కారణాల దృష్ట్యా పాక్‌లో పర్యటించేది లేదని బీసీసీఐ ఇప్పటికే తేల్చి చెప్పింది. తాము ఆడే మ్యాచ్‌లను తటస్థ వేదికలకు మార్చి.. హైబ్రిడ్‌ మోడల్‌లో టోర్నీని నిర్వహించాలని ఐసీసీని కోరింది. హైబ్రిడ్‌ మోడల్‌కు పీసీబీ ముందుగా ఒప్పుకోకున్నా.. ఐసీసీ దెబ్బకు దిగొచ్చింది. అయితే హైబ్రిడ్‌ మోడల్‌లో నిర్వహించే విషయంపై పీసీబీ తన స్పష్టమైన వైఖరిని ఇప్పటికీ అధికారికంగా వెల్లడించలేదు. దీంతో షెడ్యూల్‌ విడుదల వాయిదా పడుతూ వస్తోంది.

ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 మధ్య జరిగే అవకాశం ఉంది. టోర్నీ ఇంకా దాదాపు 70 రోజుల సమయమే ఉంది. దీంతో ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసం ఇప్పటికే డబ్బు ఖర్చు చేసిన బ్రాడ్‌కాస్టర్స్‌ ఆందోళన చెందుతున్నాయి. షెడ్యూల్‌ను త్వరగా విడుదల చేయాలని ఐసీసీపై ఒత్తిడి పెంచుతున్నాయి. పీసీబీ ఏ విషయం చెప్పకపోవడంతో.. ఐసీసీ సందిగ్ధంలో పడింది. అయితే షెడ్యూల్ ప్రకటన ఆలస్యమైతే.. టోర్నీలో భారీ మార్పు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఛాంపియన్స్‌ ట్రోఫీని 50 ఓవర్ల ఫార్మాట్‌లో కాకుండా.. టీ20 ఫార్మాట్‌లో నిర్వహించే అవకాశం ఉందట.

ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 బ్రాడ్‌కాస్టర్స్ సహా కొంతమంది వాటాదారులు టీ20 ఫార్మాట్‌ను ప్రతిపాదించారని సమాచారం. ‘ఛాంపియన్స్‌ ట్రోఫీపై అనిశ్చితి కొనసాగితే.. టోర్నీని టీ20 ఫార్మాట్‌కు మార్చాలని కొంతమంది వాటాదారులు కోరే అవకాశం ఉంది. వన్డేలకు రానురాను ఆదరణ తగ్గిపోతుంది. ఈ నేపథ్యంలో టోర్నమెంట్‌ను టీ20 ఫార్మాట్‌గా మార్చితే.. సులభంగా, వేగంగా మార్కెటింగ్‌ చేసుకోవచ్చు’ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. మరి ఐసీసీ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఒకవేళ హైబ్రిడ్‌ మోడల్‌కు పీసీబీ ఓకే చెబితే.. భారత్‌ మ్యాచ్‌లు దుబాయ్‌లో జరగనున్నాయి.

Exit mobile version