జార్ఖండ్ లో కొత్త ప్రభుత్వ ఏర్పాటు ఉత్కంఠకు తెరదించుతూ జెఎంఎం నేత చంపై సోరెన్ రాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇవాళ మధ్యాహ్నం రాష్ట్ర రాజధాని రాంచీలోని రాజ్ భవన్ లో 12 గంటల 15 నిమిషాలకు గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ చంపై సోరెన్ తో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. అయితే, భూకుంభకోణం కేసులో మాజీ సీఎం హేమంత్ సోరెన్ ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన తర్వాత జార్ఖండ్ లో కొత్త సర్కారు ఏర్పాటుపై అయోమయం నెలకొంది. దీంతో 43 మంది ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు జెఎంఎం, ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి నేతలు తీవ్ర ప్రయత్నాలు చేశారు. కూటమి ఎమ్మెల్యేలను ఇప్పటికే క్యాంప్ కు కూడా తరలించారు. ఈ క్రమంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ రాష్ట్ర గవర్నర్ నుంచి పిలుపు రావడంతో జెఎంఎం శాసనసభాపక్ష నేత చంపై సోరెన్ గవర్నర్ సీ.పీ.రాధాకృష్ణన్ ను కలిశారు.
Read Also: Poonam Pandey Dead: షాకింగ్.. అనారోగ్యంతో బాలీవుడ్ నటి పూనమ్ పాండే మృతి!
అయితే, తమకు మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉంది.. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్ ను చంపై సోరెన్ కోరడంతో.. ఈరోజు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, చంపై సోరెన్ కొత్త ప్రభుత్వం కొనసాగాలంటే..10 రోజుల్లోగా అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవాల్సి ఉంది. మరో వైపు బీజేపీ ఎలాంటి కుట్ర చేస్తుందనే ఆలోచనతో జెఎంఎం, ఆర్జెడీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఇప్పటికే రహస్య ప్రాంతానికి తరలించారు.