Bigg boss 6: బిగ్‌బాస్ సీజన్ 6లో ప్రేక్షకులకు ఎంతో వినోదాన్ని పంచుతాడని భావించిన చలాకీ చంటీ ఈ వారం ఎలిమినేషన్‌కు గురయ్యాడు. అతనికి వ్యూవర్స్ నుండి మంచిగానే ఓట్లు పడే ఆస్కారం ఉన్నా, హౌస్ నుండి బయటకు రావడం వెనుక వేరే కారణం ఉందని భావిస్తున్నారు. మొదటి రెండు వారాల తర్వాత చంటీ చాలా రిలాక్స్ అయిపోయాడని, ఒకవేళ హౌస్ నుండి బయటకు పంపినా తానేమీ బాధ పడననే రీతిలో తయారయ్యాడని నిర్వాహకులు భావించారని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా హోటల్ టాస్క్ లో బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్ ను ఏ మాత్రం చంటీ కేర్ చేయకపోవడం నిర్వాహకులకు ఆగ్రహాన్ని తెప్పించిందని అంటున్నారు. దానికి చంటీ ఏవేవో రీజన్స్ చెప్పినా వాళ్ళు వాటిని పరిగణనలోకి తీసుకోలేదట! పలు సందర్భాలలోనూ ఇతర కంటెస్టెంట్స్ తో ఈ షోను తాను సీరియస్ గా తీసుకోవడం లేదని చంటి చెప్పడం ఈ ఎలిమినేషన్ కు కారణంగా కనిపిస్తోంది. ఈ విషయంలో చంటీ అయితే చాలా క్లారిటీగా ఉన్నాడు. కారణాలు ఏవైనా… అతను హౌస్ లో పూర్తి స్థాయిలో టాస్కు లలో పాల్గొనలేదు. అలానే తనకిచ్చిన పనిని అంటీ ముట్టనట్టుగానే చేశాడు. పేరులోని చలాకీ తనాన్ని అస్సలు చూపించని చంటిని ఇంకా హౌస్ లో కంటిన్యూ చేస్తే, మిగిలిన కంటెస్టెంట్స్ మీద ఆ ప్రభావం పడే ఛాన్స్ ఉంటుందని భావించే బిగ్ బాస్ ఈ నిర్ణయం తీసుకున్నానని పలువురు అభిప్రాయ పడుతున్నారు. విశేషం ఏమంటే…. ఎలిమినేషన్స్ లాస్ట్ రౌండ్ లోకి ఇనయా, చంటి వచ్చినప్పుడు కూడా చంటీ ఎలాంటి ఆందోళన చెందకుండా, కన్నీళ్ళు పెట్టుకుంటున్న కంటెస్టెంట్స్ ను ఓదార్చే క్రమంలో ఇక్కడికి మూడు నెలలు ఉందామని వచ్చాను, కాస్తంత ముందు వెళ్ళిపోతున్నా. దానికి బాధపడాల్సిందేముందీ! అంటూ ఈ షోను చాలా లైట్ గా తీసుకోమన్నట్టుగానే ప్రవర్తించాడు.
ఇదిలా ఉంటే… ప్రోమోస్ లో చూపించినట్టుగానే… ఈ సండే ప్రసారమైన ఎపిసోడ్ కు అభిమానులు డీఎస్పీ అని ప్రేమగా పిలుచుకునే దేవిశ్రీ ప్రసాద్ వచ్చాడు. తాను కంపోజ్ చేసిన పాటలను పాడి, ఆడటమే కాకుండా, ఆ వేదికపై పాన్ ఇండియా పాప్ సాంగ్ ఓ పిల్లా ను నాగార్జున చేతుల మీదుగా ఆవిష్కరింప చేశాడు. వివిధ రాష్ట్రాలలో మరుగున పడి ఉన్న మ్యుజీషియన్స్ ను లైమ్ లైట్ లోకి తీసుకొచ్చే క్రమంలో ఇలా పాన్ ఇండియన్ పాప్ సాంగ్స్ తాను చేస్తున్నానని దేవిశ్రీ ప్రసాద్ తెలిపాడు. ఆ తర్వాత దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన పాటలకు సంబంధించిన పెట్టిన టాస్క్ లో ఒకరిద్దరు తప్ప మిగిలిన వారంతా ఫెయిల్ అయ్యారు. చలాకీ చంటీ నిష్క్రమణతో కాస్తంత డీలా పడ్డ, కంటెస్టెంట్స్ సోమవారానికైనా దాని నుండి బయటకు వస్తారో లేదో చూడాలి!!