Andhra Pradesh: కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర అధికారుల బృందం పర్యటించింది. చోడవరంలో దెబ్బతిన్న బొప్పాయి, అరటి, కంద పంటలను కేంద్ర బృందం పరిశీలించింది. మద్దూరులో కేంద్ర బృందాన్ని కలిసి రైతులకు జరిగిన పంట నష్టాన్ని మాజీ మంత్రి వడ్డే శోభనదీశ్వరరావు వివరించారు. ఈ కార్యక్రమంలో పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్, జిల్లా కలెక్టర్ బాలాజీ, ఆర్డీవో రాజు పాల్గొన్నారు.
Read Also: CM Chandrababu: ప్రతి కుటుంబానికి రూ.10 వేలు, హెక్టార్‌కు రూ.25 వేలు.. సీఎం చంద్రబాబు ప్రకటన
బోడె ప్రసాద్ మాట్లాడుతూ.. వరద ప్రభావిత ప్రాంతాల్లో రైతులను ఆదుకోవాలని పంట నష్టం అంచనా వేయడం కోసం కేంద్ర బృందం పర్యటిస్తోందని తెలిపారు. వరదల వల్ల చాలా కాలనీల్లో ఇళ్లు కూడా నీట మునిగాయన్నారు. ఇంటిలోని సామాన్లు వారం రోజులు నీళ్లతో నాని పనికిరాకుండా పోయాయని కేంద్ర బృందానికి బాధితులు విన్నవించుకున్నారు. రైతు సమస్యలు మాజీ మంత్రి వడ్డే శోభనాద్రి కేంద్ర బృందం దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున చంద్రబాబు పది రోజులు ఇంటికి కూడా వెళ్లకుండా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేరవేయడంలో, వారికి ఆహారం అందుతుందా లేదా అని దగ్గరుండి పర్యవేక్షించారని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు. వరద తగ్గాక ప్రజలను సురక్షితంగా ఇళ్లకు పంపడం ఫైర్ ఇంజన్లతో బురదను శుభ్రం చేయడం అన్ని సమీక్షించి ఇంటికి వెళ్లారన్నారు. కేంద్ర బృందానికి ఇక్కడ జరిగిన నష్టం మొత్తం వివరించడం జరిగిందన్నారు. త్వరలోనే కేంద్రం నుంచి మంచి ప్రకటన వస్తుందని ఆశిస్తున్నామని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు.